Cooperative Conference: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రి ఇవాళ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ సహకార సంస్థల మెగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగుతుండగా.. ఈ కాన్ఫరెన్స్‌ను సహకార సంస్థలు IFFCO, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, NAFED, KRIBHCOతోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తుండటం విశేషం.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో మనం మరింత పురోగతిని చూడాల్సిన అవసరం ఎంతో ఉందని సహకారశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఇఫ్కో 1966 లో 77 సొసైటీలతో ప్రారంభమైందని చెప్పిన ఆయన.. ఇఫ్కోలో ప్రస్తుతం 3.5 కోట్ల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. మరింత మంది రైతులు దీనిలో పాలుపంచుకుంటేనే మంచి ఫలితాలు సాధించగలమని అమిత్ షా పేర్కొన్నారు.
దేశంలో సహకార రంగాన్ని ఆధునీకరించి శాస్త్రీయంగా మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి అమిత్ షా చెప్పారు. అందుకే కేంద్రం సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఇక మీదట రైతుల రుణాలలో 25 శాతం సహకార రంగంలోనే నిర్వహించబడతాయని చెప్పారు.
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ అత్యంత ఆవశ్యకమన్న అమిత్ షా.. ఈ రంగం $ 5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. గ్రామీణాభివృద్ధి దేశాభివృద్ధికి ఈ రంగం ఎంతో దోహదపడుతుందని కేంద్ర సహకార మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సహకార రంగాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు అమిత్ షా. సహకారాన్ని మన వ్యక్తిత్వ లక్షణంగా తీసుకురావాలని అమిత్ షా పేర్కొన్నారు.
కేంద్ర సహకార శాఖ ఆవశ్యకతను ప్రశ్నించిన విపక్ష నేతలకు కేంద్రమంత్రి అమిత్ షా సభా ముఖంగా సమాధానమిచ్చారు. దేశంలో తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని దేశ గ్రామీణ ప్రజలు తట్టుకునేందుకు సహకార రంగం చాలా దోహదపడిందని అమిత్ షా చెప్పారు. 1947 సహకార రంగం దేశంలో పరిఢవిల్లుతోందని అమిత్ షా అన్నారు.
దేశంలో అగ్రశ్రేణి రాజకీయ నేత పండింట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ జయంతి రోజున ఈ సహకార సదస్సు జరుగుతుండటం చాలా ఆనందకరంగా ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
పలువురు వక్తల ప్రసంగం అనంతరం న్యూఢిల్లీలో జరుగుతోన్న ‘జాతీయ సహకార సదస్సు’లో హోం మంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు.
ఈ సహకార సమావేశం కార్యక్రమంలో ఇఫ్కో ఛైర్మన్ బల్వీందర్ సింగ్ నకాయ్ స్వాగతోపన్యాసం చేస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని తొలి జాతీయ సహకార సదస్సుకు చేరుకున్నారు. అమిత్ షా జ్యోతి ప్రజ్వలన చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా జీవితంపై డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించారు.
ఈ కొత్త మంత్రిత్వ శాఖను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇంత పెద్ద సదస్సు జరగనుండటం ఇదే తొలిసారి. సహకార సంస్థలకు ‘సులభతరమైన వ్యాపారం’ కోసం ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, బహుళ-రాష్ట్ర సహకార(ఎంఎస్‌సిఎస్) సంస్థల అభివృద్ధికి శ్రీకారం చుట్టే దిశగా ఈ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పని చేయనుంది.
మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ కొత్త శాఖపై సీపీఎం ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. రాష్ట్రాల హక్కులను హరించేందుకే ఈ శాఖను తీసుకొచ్చారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం సహకార సంఘాలు పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, అలాంటప్పుడు కేంద్రం ఈ శాఖను ప్రవేశపెట్టడంలో ఆంతర్యమేంటని ఆయన నిలదీస్తున్నారు. సహకార బ్యాంకులను దోచుకోవడానికే కేంద్రం ఈ శాఖను ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు.
భారత దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి వీలుగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక పరిపాలన, చట్టపరమైన, విధానపరమైన రూపాన్ని అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో సహకార సంస్థలను మరింత పటిష్టం చేయడానికి ఈ మంత్రిత్వ శాఖ తన వంతు ప్రయత్నం చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ను నిజం చేయడమే ఈ సహకార శాఖ లక్ష్యం.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ సహకార రంగ సమావేశానికి 2వేల మంది ఈ సదస్సులో ప్రత్యక్షంగా పాలుపంచుకోనుండగా.. 8 కోట్ల మంది వర్చువల్‌గా పాల్గొంటున్నారు. 110 దేశాల్లోని 3 మిలియన్ల సహకార సంస్థలు భాగమైన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ (గ్లోబల్) సంస్థ కూడా వర్చువల్‌గా ఈ సదస్సులో పాల్గొననున్నట్లు ఐఎఫ్‌ఎఫ్‌సీవో(IFFCO) వెల్లడించింది.
ఈ మెగా సహకార సదస్సులో మోదీ సర్కారు ఈ సహకార రంగం అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో, ప్రభుత్వ విజన్ ఏంటనే విషయాలను ప్రధానంగా అమిత్ షా వెల్లడించనున్నారు. ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వ విజన్, రోడ్‌మ్యాప్ గురించి ఆయన సభ్యులకు తెలియజేస్తారు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఏడాది జూలైలో సృష్టించబడిన కొత్త సహకార మంత్రిత్వ శాఖకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా అమిత్ షా ప్రసంగిస్తోన్న మొదటి జాతీయ సహకార సమావేశం ఇదే కావడం విశేషం.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి వరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న సహకార శాఖను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను హోంమంత్రి అమిత్ షా కు అప్పగించారు. తాజాగా ఈ శాఖకు కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దేవేంద్ర కుమార్ సింగ్‌ను కార్యదర్శిగా నియమించారు.