
గత సంవత్సరం కూలిపోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో కీలక పురోగతి నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానించిన ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (Fuel Control Switch) లాకింగ్ మెకానిజంపై నిర్వహించిన సమగ్ర పరీక్షల్లో ఇప్పటివరకు ఎలాంటి అసాధారణతలు గుర్తించలేదని ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ వివరాలను వెల్లడించారు. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ (OEM) ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో నిర్వహించిన పరీక్షల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌తో పాటు దాని లాకింగ్ డిటెంట్‌ల నిర్మాణ సమగ్రతను క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ ఎలాంటి సాంకేతిక లోపం కనిపించలేదని ఆయన తెలిపారు.
అయితే, ప్రమాద దర్యాప్తులో మరో కీలక అంశమైన పూర్తి థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్‌పై అమెరికాలోని సియాటిల్‌లో OEM నిపుణులు ఇంకా సవివర పరీక్షలు కొనసాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మాత్రమే ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే రకమైన విమానాలపై చేపట్టిన ప్రత్యేక ఎయిర్‌వర్థినెస్ తనిఖీలలో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ సాంకేతిక పరీక్షలను ఆదేశించింది. విమాన భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి అనుమానాస్పద అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని మోహోల్ చెప్పారు.
ఇదిలా ఉండగా, విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) తుది నివేదిక విడుదలలో జాప్యం జరుగుతోందన్న విమర్శలను కూడా కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రధాన విమాన ప్రమాదాల దర్యాప్తులకు ముందుగా నిర్ణయించిన గడువు ఉండదని, ప్రతి సాంకేతిక అంశాన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాతే నివేదికను సిద్ధం చేస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం AI-171 ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరుకుందని, ప్రమాదానికి దారితీసిన అన్ని సంభావ్య కారణాలు, సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు లేదా ఇతర దోహదకారి అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపింది.
దర్యాప్తు పూర్తయిన అనంతరం అన్ని ఆధారాలు, సాంకేతిక విశ్లేషణలు, నిపుణుల అభిప్రాయాలతో కూడిన తుది నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఆ నివేదికను విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు కూడా పేర్కొంది. పూర్తి థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్ పరీక్షల ఫలితాలపై ఇప్పుడు విమానయాన రంగంతో పాటు బాధిత కుటుంబాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..