
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లూ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగిన ద్విముఖ పోరుకు చెక్ పెడుతూ.. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించింది. అయితే ఎన్నికల ఫలితాల కంటే కూడా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అరవ రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేలో మొదలైన ముసలం ఆ పార్టీ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా అన్నాడీఎంకే సీనియర్ నేత షణ్ముగం వర్గం సీఎం విజయ్‌కు జై కొట్టారు. మంగళవారం సాయంత్రం వారంతా విజయ్‌ను కలిసే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలకు అద్దం పట్టింది. మాజీ సీఎం, పార్టీ అధినేత పళనిస్వామి ఒక వర్గంతో అసెంబ్లీలోకి ప్రవేశించగా.. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సి.వి. షణ్ముగం మరో వర్గంతో విడిగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శాసనసభా పక్ష నాయకుడిగా పళనిస్వామికి కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలికారు. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఈపీఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ షణ్ముగం వైపు నిలబడటం గమనార్హం.
పార్టీలో మెజారిటీ నాయకులు ఈపీఎస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వర్గాన్ని దూరం పెట్టడం, పొత్తుల విషయంలో పళనిస్వామి మొండి వైఖరి వల్లే పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ.. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా కాపాడుకోలేని స్థితికి చేరడంపై క్యాడర్ రగిలిపోతోంది.
ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీ, తొలుత మ్యాజిక్ ఫిగర్ కోసం ఇబ్బంది పడింది. ఆ సమయంలోనే అన్నాడీఎంకే నుంచి సుమారు 25 నుండి 30 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ డీఎంకే మద్దతుతో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ పళనిస్వామి వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడటంతో అప్పట్లో ఆ ప్రయత్నం ఆగింది. అయితే చివరకు కాంగ్రెస్, వామపక్షాలు, విసికే మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ అన్నాడీఎంకేలోని అసంతృప్త ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తుండటం విశేషం. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం తమిళనాడులోని పాత తరం రాజకీయాలకు సమాధి కడుతోందా..? పళని స్వామి తన పట్టును కాపాడుకుంటారా? లేక అన్నాడీఎంకే చరిత్రలో కలిసిపోతుందా..? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.