మహారాష్ట్రలో విదర్భ రీజన్ లోని యావత్ మల్, అమరావతి, అకోలా నగరాల్లో ఏ క్షణమైనా మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రకటించారు. రాష్ట్రంలో ఒక్కసారిగా కోవిడ్ 19 కేసులు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 4,787 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒకే రోజున ఇన్ని అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. సీఎం ఉధ్ధవ్,ఆయన డిప్యూటీ అజిత్ పవార్ గురువారం అత్యవసర స మావేశం జరిపి రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షించారు. ఈ మూడు నగరాల కలెక్టర్లను, ఇతర అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిపించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించని పక్షంలో వారు తిరిగి లాక్ డౌన్ పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చునని ఉధ్ధవ్ ఇటీవలే హెచ్ఛరించారు. ప్రపంచ దేశాల్లో పలు చోట్ల మళ్ళీ ఈ విధమైన కఠిన ఆంక్షలను విధించారని ఆయన గుర్తు చేశారు.
కేరళ నుంచి వచ్ఛే ప్రజలపై ట్రావెల్ ఆంక్షలను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లోనే నిర్ణయించింది. మహారాష్ట్ర లోకి వచ్ఛే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టులను తీసుకురావాలని సూచించింది. గత ఏడాది నవంబరు 23 నుంచే ఢిల్లీ, రాజస్తాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి ట్రావెల్ నిబంధనలు అమల్లో ఉన్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ :