కాంగ్రెస్ కార్తకర్తల ప్రవర్తన దేశానికే అవమానం.. ఏఐ సమ్మిట్ ఘటనపై స్పందించిన లోకేశ్, జగన్ కేటీఆర్..

‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ నిరసనల వెనుక అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసేందుకు భారీ కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న సమయంలో ఇటువంటి నిరసన చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై అగౌరవపరచడమేనని పలు రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

కాంగ్రెస్ కార్తకర్తల ప్రవర్తన దేశానికే అవమానం.. ఏఐ సమ్మిట్ ఘటనపై స్పందించిన లోకేశ్, జగన్ కేటీఆర్..
Youth Cong workers protest

Updated on: Feb 21, 2026 | 3:44 PM

ఢిల్లీ AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌లోకి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దూసుకెళ్లిన ఘటనపై రాజకీయ రగడ రాజుకుంది. సదస్సు లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలు అమెరికాతో ట్రేడ్‌ డీల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు చేశారు. అమెరికాకు ప్రధాని మోదీ లొంగిపోయారని నినాదాలు చేశారు. చొక్కాలు విప్పి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేయడం అందరికి షాక్‌ను కలిగించింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నలుగురు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేశారు.

AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌ రూమ్‌ నెంబర్‌ 5లో ఈ అనూహ్య ఘటన జరిగింది. క్యూర్‌ కోడ్‌ను ఉపయోగించి కాంగ్రెస్‌ కార్యకర్తలు సమ్మిట్‌ లోకి దూసుకెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటన తరువాత భారత మండపం దగ్గర భద్రతను పెంచారు. హై సెక్యూరిటీ జోన్‌ లోకి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. యూత్‌ కాంగ్రెస్‌ నిరసనపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడ్డారు. AI సమ్మిట్‌ విజయవంతం కావడం జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇలాంటి నిరసన చేపట్టారని బీజేపీ విమర్శించింది. దీని వెనుక రాహుల్‌గాంధీ , సోనియా, ప్రియాంకల కుట్ర ఉందని బీజేపీ ఆరోపించింది.

కాంగ్రెస్ కార్యకర్తలు తీరుపై ఇతర రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ కలిగించిన అంతరాయంపై నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి వేదికగా భారత్ కృత్రిమ మేధస్సు రంగంలో ఎదుగుతున్న శక్తిగా నిలుస్తున్న సమయంలో, అలాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. రాజకీయాలకంటే దేశ నిర్మాణం, ఆవిష్కరణలు, ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని, భారత్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ కూడా స్పందించారు. ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ప్రవర్తన దేశానికి అవమానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. మన రాజకీయాలు ఎటు దిశగా సాగుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా, దేశ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలు ఎవరూ చేయకూడదని, ప్రపంచ వేదికలపై భారతదేశం ఏకతాటిపై నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబట్టారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ వేదికను యూత్ కాంగ్రెస్ రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం అత్యంత ఖండనీయమని ఆయన అన్నారు. ఇలాంటి ప్రపంచ స్థాయి కార్యక్రమంలో నిరసనలు చేపట్టడం వల్ల దేశంపై అంతర్జాతీయంగా చెడు అభిప్రాయం పొందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, ఎక్కడ ఎలా నిరసన వ్యక్తం చేయాలో అవగాహన అవసరమని అన్నారు. రాజకీయ విభేదాలకు సమయం, స్థలం వేరుగా ఉండాలని, అంతర్జాతీయ సదస్సు అలాంటి వేదిక కాదని స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే ఈ నిరసన జరగడం వ్యంగ్యంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. న్యూ ఢిల్లీ లో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్’ సందర్భంగా అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన వారి చర్యలు అత్యంత అనుచితమైనవి, ఖండనీయమైనవని ఆమె పేర్కొన్నారు. దేశ విదేశాల ప్రముఖులు పాల్గొన్న ఇలాంటి ప్రపంచ వేదికపై ఇలాంటి ప్రవర్తన దేశ గౌరవం, ప్రతిష్ఠకు హాని కలిగిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్ఠ దెబ్బతినకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

Follow Us