
చెవులు, నదులు, కాలువల్లో ఈత కొట్టడం, మునగడం లాంటి అలవాట్లు ఉన్నాయా..? అయితే జాగ్రత్త..! మెదడును తినే అమీబాల ముప్పు పొంచి ఉంది. కేర్‌ఫుల్‌గా ఉండకపోతే ప్రాణాలు పోతాయ్. ఇది చాలా అరుదైనప్పటికీ, ఒక్కసారి అటాక్ అయితే బాధితులకు చావే గతి. కేరళలోని కోజికోడ్‌లో బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలొదిలింది.
కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ బాలికకు వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధిత బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. బ్రెయిన్ఈటింగ్ అమీబాతోనే బాలిక చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. ఈ ఏడాది జిల్లాలో ఈ తరహా కేసులలో ఇది నాల్గవది కావడంతో కేరళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అయితే.. కేరళలో ఈ సంవత్సరం 8 కేసులు నిర్ధారించారని.. రెండు మరణాలు నమోదయ్యాయని పేర్కొంటున్నారు. వాస్తవానికి మెదడును తినే అమీబా కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 97 శాతంగా ఉందని దీని గురించి పెద్దగా ఆందోళన అక్కర్లేదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..
మెదడును తినేసే అమీబాను శాస్త్రీయంగా నెగ్లేరియా ఫోలేరి అని పిలుస్తారు. ఇది అరుదైన, ప్రమాదకరమైన సూక్ష్మజీవి. నెగ్లేరియా ఫోలేరి సాధారణంగా సరస్సులు, నదులు, కాలువలు ఉన్న వెచ్చని నీటిలో నివసిస్తుంది. ఈ నీటిలో ఈత కొట్టడం, మునగడం వల్ల అమీబా ముక్కు ద్వార మెదడులోకి చేరి, కేంద్ర నాడీ వ్యవస్థను నాశనం చేస్తుంది.
తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు
మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ, కోమా
ఇన్ఫెక్షన్ సోకిన వారంలోపే ప్రాణాంతకం
చెరువులు, నిలిచిన నీటిలో స్నానం చేయనివ్వకూడదు
స్విమ్మింగ్ పూల్స్, వాటర్ థీమ్ పార్క్‌లలో నీటిని క్లోరినేట్ చేయడం తప్పనిసరి
ఈ వ్యాధి సోకినప్పుడు ప్రారంభంలో సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు ఇబ్బంది పెడతాయి. వ్యాధి తీవ్రమైన తరుణంలో మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ, కోమా తదితర సమస్యలు తలెత్తుతాయి. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ వారంలోపే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
ఈ వ్యాధి నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. పిల్లలను చెరువులు లేదా నిలిచిన నీటిలో స్నానం చేయనివ్వకూడదని సూచించారు. స్విమ్మింగ్ పూల్స్, వాటర్ థీమ్ పార్క్‌లలో నీటిని క్లోరినేట్ చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం మన దగ్గర కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జాగ్రత్త..! వరదలు, నిలిచిపోయిన నీరు, పారుతున్న వాగులో ఆడుకునేటప్పుడు, ఈత కొట్టేటప్పుడు పిల్లలను కనిపెడుతూ ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కలుషిత నీటికి దూరంగా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
బహిరంగంగా చెత్త పారవేయడం, వాతావరణ మార్పులు, వలస కార్మికుల ప్రవాహం పెరగడం, మెరుగైన రోగ నిర్ధారణ సౌకర్యాలు కారణంగా నీటి వనరులు కలుషితం కావడం వల్ల ఇలాంటి కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనేది కలుషితమైన నీటిలో కనిపించే స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు సంక్రమణ. ఇది సాధారణంగా కలుషితమైన నీటిలో కనిపిస్తుంది.. ఎక్కువగా పిల్లలను సోకుతుందని పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..