
బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం (అక్టోబర్ 9), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలోని రాజ్ భవన్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి మోదీ-కీర్ స్టార్మర్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రధాన కార్యక్రమాలను ప్రకటించారు. తొమ్మిది ప్రముఖ బ్రిటిష్ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు భారతదేశంలో క్యాంపస్‌లను ప్రారంభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఇప్పటికే గురుగ్రామ్‌లో తన క్యాంపస్‌ను ప్రారంభించింది. దాని మొదటి బ్యాచ్ విద్యార్థులను చేర్చుకుంది. భారతదేశ జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య విద్యా సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన సమావేశంలో, భారతదేశం-UK మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. శిఖరాగ్ర సమావేశంలో, ఖనిజ, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడానికి ISM ధన్‌బాద్‌లో ఉపగ్రహ ప్రాంగణంతో కూడిన పారిశ్రామిక సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. దీంతో రెండు దేశాల మధ్య సాంకేతిక, పారిశ్రామిక సహకారానికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.
అదనంగా, రెండు దేశాలు సైనిక శిక్షణలో సహకరించుకోవడానికి అంగీకరించాయి. ఇందులో భాగంగా భారత వైమానిక దళ ఫ్లయింగ్ బోధకులు బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో శిక్షకులుగా పనిచేస్తారు. భారతదేశ శక్తి, సామర్థ్యాలు, చైతన్యం, బ్రిటన్ నైపుణ్యంతో కలిపి, ఒక ప్రత్యేకమైన సినర్జీని సృష్టిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ భాగస్వామ్యం నమ్మకం, ప్రతిభ, సాంకేతికతపై ఆధారపడి ఉంటుందన్నారు.
ఈ పర్యటన విద్య, భద్రతా రంగాలలోనే కాకుండా, పారిశ్రామిక, సాంకేతిక సహకారంలో కూడా కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని రెండు దేశాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం-బ్రిటన్ మధ్య ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు భవిష్యత్ వృద్ధికి అనేక అవకాశాలు, మార్గాలను సుగమం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక భాగస్వామ్యం నుంచి సానుకూల ఫలితాలు రాబట్టేందుకు పారిశ్రామికవేత్తలతో తమ ప్రభుత్వం సన్నిహితంగా పనిచేస్తోందని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ తెలిపారు. వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం కాదు వ్యాపార సంస్థలు పూర్తి సామర్ధ్యం సాధించేలా ప్రభుత్వాలు సాయపడాలని స్టార్మర్ సూచించారు.
భారత్- బ్రిటన్‌మధ్య మిసైల్ ఒప్పందం కుదిరింది. దీని విలువ 468 మిలియన్ డాలర్లు. స్వావలంబన భారత్ స్ఫూర్తితో కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో భారత రక్షణ వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు తీరనున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం కారణఁగా ఉత్తర ఐర్లాండ్‌లో ప్రత్యక్షంగా 700 ఉద్యోగాలు ఏర్పడతాయి.
భారత్-బ్రిటన్ ప్రధానుల మధ్య జరిగిన చర్చల్లో ఖలీస్థానీ ఉగ్రవాద విషయం కూడా చర్చకు వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ వాణిజ్యం, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి సారించారని వెల్లడించారు. భారత్-బ్రిటన్ భాగస్వామ్యం ప్రజల కోసమని మిస్రీ ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..