భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్దది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ఇండియన్ రైల్వేను ఉపయోగించి ప్రయాణిస్తుంటారు. దేశంలో పెరుగుతున్న విమానయాన, రోడ్డు మార్గాలను ఎప్పటికప్పుడు ఎంతలా మెరుగుపరిచినప్పటికీ, రైలు అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే ప్రయాణ మార్గంగా నిలిచింది. దీనికి కారణం ఆర్థికమే కాదు సౌకర్యవంతమైన ప్రయాణం కూడా. భారత రైల్వే నెట్‌వర్క్ 70,225 కిమీ. ట్రాక్ పొడవు 1,26,366 కిమీ. మొత్తం 28 రాష్ట్రాలను కలుపుతూ పెద్ద సంఖ్యలో రైలు సర్వీసులు నిత్యం నడుస్తుంటాయి. అందులో దాదాపు 71శాతం మార్గాలు విద్యుదీకరించబడ్డాయి. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫారమ్‌లను కలిగిన రికార్డును కూడా భారతీయ రైల్వే కలిగి ఉంది. అంతేకాకుండా దేశంలో వేలాది మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే కావడం విశేషం.
భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి మాత్రమే కాదు.. ఇది ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చటమే కాదు.. మరో పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది. ఈ సరుకు రవాణా రైలు కోర్బా నుండి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు దూరాన్ని చేరుకోవడానికి 11.20 గంటలు పడుతుంది. ఈ రైలుకు ఆ పరమాత్ముడు శివుని మెడలో ఉన్న వాసుకి సర్పం పేరు పెట్టారు. దేశంలోనే అత్యంత పొడవైన ఈ రైలు నడుస్తుంటే అచ్చం పాములా కనిపిస్తుంది. భారతీయ రైల్వే పరిధిలో రోజుకు 13000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తాయి. ఇండియన్ రైల్వేస్ వ్యవస్థలో ప్యాసింజర్ రైళ్లు, సెమీ-హై-స్పీడ్ వందే భారత్ కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగంగా పని చేస్తోంది. అయితే దేశంలో అత్యంత పొడవైన రైలు ఏదో తెలుసా? ఈ రైలు చాలా పొడవుగా ఉంటుంది. దాని కోచ్‌లను లెక్కించాలంటే మీరు అలసిపోతారు.
భారతీయ రైల్వేలలో అతి పొడవైన రైలు 3.5 కి.మీ. ఒకవైపు నుంచి ఈ రైలు కోచ్‌లను లెక్కించడం ప్రారంభిస్తే కళ్లు అలిసిపోతాయి. కానీ, కోచ్‌ల లెక్కింపు ఆగదు. ఈ రైలు పేరు సూపర్ వాసుకి. ఇందులో 295 కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ సూపర్ వాసుకి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలోని గనుల నుంచి సేకరించిన బొగ్గును పవర్ ప్లాంట్లకు రవాణా చేస్తారు. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుండి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు ఒకేసారి 27 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తుంది. రైలులోని 295 కోచ్‌లను ఆరు ఇంజన్‌ల ద్వారా నడిపిస్తారు.. ఈ రైలు రైల్వే క్రాసింగ్ గుండా వెళితే, రైలు మొత్తం దాటడానికి చాలా సమయం పడుతుంది. అందుకే దాని పేరు సూపర్ వాసుకి రైల్వే సరుకు రవాణా రైలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..