Farmers Suicide Rate In India: హలం పట్టి.. పొలం దున్ని.. శ్వేదంతో నేలను తడిపి, దేశానికి కడుపునిండా భోజనం పెట్టే కర్షకుని జీవిత మంతా కష్టాల కడగండ్లే. అవును.. ఆరుగాలాలపాటు ఎండెనక.. వానెనక కష్టపడితే.. పంట చేతికొచ్చే సమయానికి వస్తుంది అనుకోని అతిధి వర్షం రూపంలో! ఎలాగోలా తట్టుకుని నిలబడితే మద్ధతు ధరనివ్వరు ఒకరు, కమీషన్లంటారు మరొకరు, అంతా చేసి చివరికి మిగిలేది పంటను బతికించుకోవడానికి చేసిన అప్పులు మాత్రమే. చేసిన అప్పు తీర్చలేక.. వేరే గతిలేక.. వ్యవసాయాన్ని వదులుకోలేక తల్లడిల్లి చివరికి మట్టిని నమ్ముకున్నందుకు ఆ మట్టిలోనే తనువులు చాలిస్తున్నాడు మన అన్నదాత. ప్రభుత్వాలు పథకాలు పెడుతున్నా ఎక్కడ లోపం తలెత్తుతుందే ఓ సారి పరికించి చూస్తే తప్ప మన వ్యవవసాయాన్ని బతికించుకోలేము. దేశ వ్యాప్తంగా గత ఏడాది సంభవించిన రైతు ఆత్మహత్య గణాంకాలు పరిశీలిస్తే మన దేశ రైతు కన్నీటి దీన గాథ ఏ విధంగా ఉందో తెలుస్తుంది.
గత ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 21 మధ్య (11 నెలల్లో) మొత్తం 2,498 మంది మహారాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆర్టీఐ విచారణలో వెల్లడైంది. 2020లో ఈ రాష్ట్రంలో మొత్తం 2,547 మంది రైతులు తమ జీవితాలకు ముగింపుపలికారు. తాజా గణాంకాల ప్రకారం, రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, వారు సకాలంలో రుణం చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది.
ఆ ప్రాంతంలోనే అత్యధిక ఆత్మహత్యలు..
అత్యంత ఆశ్చర్యానికి గురిచేశే అంశం ఏంటంటే… రాష్ట్రంలో దాదాపు సగం ఆత్మహత్యలు విదర్భ నుంచే నమోదవుతుంటాయి. గత ఏడాది (2020)లో నమోదైన మరణాల్లో అమరావతిలో 331, యవత్మాల్‌లో 270, ఔరంగాబాద్‌లో 773 నుండి 804, నాగ్‌పూర్ 269 నుండి 309కి పెరిగాయి. ఐతే కొంకణ్ డివిజన్‌లో గత రెండేళ్లలో ఒక్క రైతు ఆత్మహత్య నమోదుకాకపోవడం విశేషం.
దేశవ్యాప్తంగా చూస్తే..
NCRB 2020 డేటా ప్రకారం.. మహారాష్ట్రలో (2021 ఏడాదిలో) రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టడానికి బదులు విపరీతంగా పెరిగాయి. 2020లో దేశం మొత్తం మీద చూస్తే వ్యవసాయ రంగంలో 10,677 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశంలో 2020 సంవత్సరంలో 1,53,052 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 7% మంది రైతులు కావడం గమనార్హం. అందులో 5,579 మంది రైతులు కాగా, 5,098 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక రైతు ఆత్మహత్యల్లో 4,006 మంది మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక (2,016), ఆంధ్రప్రదేశ్ (889), మధ్యప్రదేశ్ (735)లో రాష్ట్రాలు నిలిచాయి.
RTI ద్వారా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతుల ఆత్మహత్యల సమాచారాన్ని RTI కార్యకర్త జితేంద్ర ఘడ్గే కోరినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. భిన్న రుణమాఫీలు, పలు రైతు ప్రయోజనాలకు చెందిన పథకాలు ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, ఆత్మహత్య రేటు తగ్గడం లేదు. అందుకు గల కారణాలను రాష్ట్ర ప్రభుత్వాలు కూలంకషంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటే తప్ప ఈ మాకణ హోమాలు ఆగేలా కనిపించడం లేదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. రుణమాఫీలకు మించి ప్రభుత్వం ఆలోచించవలసి ఉంటుంది. ఆత్మహత్యలకు రైతుల మానసిక స్థితి కూడా ప్రధాన కారణం. రుణమాఫీకి బదులు దివాళా తీసిన (అప్పులు చెల్లించే శక్తిలేని) రైతుల కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్టీఐ కార్యకర్త ఈ సందర్భంగా సూచించారు.
మహారాష్ట్రలోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల (పంట మార్పిడి పద్ధతిలో) సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శివాజీ యూనివర్సిటీకి చెందిన ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ జ్ఞానదేవ్ తాలూలే పేర్కొన్నారు. ఇది రైతుల స్థితిగతులను మెరుగుపరచడానికి దోహదపడుతుందని సూచించారు.
Also Read: