ఢిల్లీ, జూన్ 20: ఓ యువకుడు దేశం దాటడానికి సినీ ఫక్కీలో ట్రై చేశాడు. అంతేనా.. జుట్టుకు, గడ్డానికి తెల్లరంగు వేసుకొని అరవయ్యేళ్ల వృద్ధుడిలా వీల్ చైర్‌లో కూర్చుని బలేగా సెట్ చేసుకున్నాడు. ఎయిర్ పోర్టు అధికారులను బోల్తా కొట్టించి, ఈజీగా దేశం దాటిపోదామనుకున్నాడు. కానీ చిన్న తప్పిదంతో సిబ్బందికి దొరికిపోయాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
24 ఏళ్ల గురు సేవక్ సింగ్ లక్నో నివాసి. అతడు కెనడా వెళ్లేందుకు ఫేర్ పాస్‌పోర్టును క్రియేట్ చేశాడు. వెంటనే తన రూపాన్ని 67 యేళ్ల వృద్ధుడిగా మార్చేసుకున్నాడు. బరేలికి చెందిన రష్వీందర్ సింగ్ సహోటా పేరుతో బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీల్ చైర్‌లో వచ్చాడు. అయితే అతడి కదలికలపై ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. అంతే దగ్గరికి వచ్చి కాస్త నిశితంగా పరిశీలించడంతో మనోడు దొరికిపోయాడు. వెంటనే తన గుర్తింపు కార్డు చూపించాలని వారు కోరారు. అతను రష్వీందర్ సింగ్ పేరిట ఉన్న ఓ పాస్‌పోర్టును వారికి అందించాడు. ఫిబ్రవరి 1957లో తాను జన్మించానని, రాత్రి 10.50 గంటలకు ఎయిర్ కెనడా విమానంలో కెనడాకు వెళ్లనున్నట్లు రష్విందర్ సింగ్ సహోటా తన గుర్తింపును వెల్లడించాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి.. కానీ ఎక్కడో తేడా కొడుతుందని భద్రతా సిబ్బందికి అనిపించింది. ఎందుకంటే అతడి శరీర ఛాయ, గొంతు చూస్తే వారికి నమ్మశక్యంగా అనిపించలేదు.
దీంతో తమదైన శైలిలో విచారించగా ముసలితోలు కప్పుకున్న గురు సేవక్ అసలు నిజం చెప్పేశాడు. ముసలివాడిలా కనిపించేందుకే జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకుని, కళ్లజోడు పెట్టుకుంటే ఎవరికీ అనుమానం రాదులే అనుకున్నాడు. కానీ అవే అతన్ని పట్టించేశాయి. పైగా అతని ఫోన్‌లో అపలె పాస్‌పోర్టు ఫొటోను భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అతన్ని, అతనితోపాటు ఉన్న వస్తువులతో సహా ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఫేక్ ఐడెంటిటీలతో వ్యక్తులను విదేశాలకు పంపే ముఠాతో నిందితుడికి సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఐజీఐ) ఉషా రంగాని తెలిపారు. అలాగే అతను ఎందుకు కెనడా వెళ్తున్నాడు? అందుకు ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అవే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఉషా రంగాని వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.