Man Kills Mother: ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం కొనుగోలు చేసేందుకు రూ.100 ఇవ్వలేదని 22 ఏళ్ల యువకుడు కన్నతల్లినే హత్య చేశాడు. ఈ ఘోర సంఘటన ఒడిశా (Odisha) జాషిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హటపాడియా సాహి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన శాలందీ నాయక్ (58) కుమారుడు సరోజ్ నాయక్ శుక్రవారం రాత్రి సారా (Alcohol) తాగి ఆ మత్తులో ఇంటికి వచ్చాడు. మళ్లీ తాగేందుకు రూ.100 ఇవ్వాలంటూ తల్లిని కోరాడు. ఇప్పటికే బాగా తాగావని.. మళ్లీ డబ్బులు ఇవ్వనంటూ తల్లి కొడుకుతో చెప్పింది. దీంతో సరోజ్ నాయక్ కోపంతో చెక్క దుంగతో ఆమెను బలంగా కొట్టాడు. తీవ్రగాయాలైన శాలందీ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
శనివారం తెల్లవారుజామున ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సరోజ్ పై హత్య కేసు నమోదు చేసి.. అతని కోసం గాలిస్తున్నట్లు జాషిపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్-ఇన్‌స్పెక్టర్ ఖ్యామసాగర్ పాండా తెలిపారు.
Also Read: