
తిరువనంతపురం, జులై 9: ఉజ్బెకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కేరళకు చెందిన 22 ఏళ్ల వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. తోటి క్లాస్‌మెట్ గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఆమెను తలపై ల్యాప్‌టాప్‌తో కొట్టి, చిత్రహింసలకు గురిచేయడంతో హత్యకు గురైనట్లు ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేరళ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం కేసు నమోదు చేసిన అనంతరం అలప్పుజ మెడికల్ కాలేజీలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న దర్యాప్తు వివరాలను భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా కోరతామని అధికారులు తెలిపారు. అక్కడ నిందితుడిపై విచారణ జరిగితే, కేరళలో నమోదైన కేసును మూసివేస్తామని వారు తెలిపారు. నిందితుడు మలప్పురానికి చెందిన బాధితురాలి క్లాస్‌మెట్.
కేరళలోని అలప్పుజా జిల్లా హరిపాడ్‌కు చెందిన సావారియా బసంత్ (22), మలప్పురానికి చెందిన సదరుల్ అనామ్ (22) కలిసి ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఏదో విషయమై జులై 23న వీరిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అనమ్ కోపోధ్రేకంతో సావారియా తలపై కొట్టడంతో ఆమె మరణించింది. దీంతో ఉజ్బెకిస్థాన్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఉజ్జెకిస్థాన్ వెళ్లి.. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చారు. వారియా తల్లిదండ్రులు జిల్లా పోలీస్ చీఫ్‌కు సమర్పించిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి బినూకుమార్ తెలిపారు.
నేరం ఉజ్బెకిస్తాన్‌లో జరిగినప్పటికీ, ఇక్కడ కేసు నమోదు చేయడానికి నిబంధనలు ఉన్నాయి. అక్కడి పోలీసులు నిందితులపై విచారణ జరిపితే, మేము కేసును మూసివేస్తాం. అక్కడ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే, మేము కేసును ముందుకు తీసుకువెళ్తామని ఆయన అన్నారు. దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడానికి కేరళ పోలీసులు భారత రాయబార కార్యాలయం ద్వారా ఉజ్బెకిస్తాన్‌లోని అధికారులతో సంప్రదిస్తారని ఆయన అన్నారు. అయితే కేసును కేరళలోనే విచారణ జరపాలని, నిందితులను ఉజ్బెకిస్తాన్ నుంచి అప్పగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. న్యాయ సలహా తీసుకుని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత అలాంటి నిబంధన ఏదైనా ఉందో లేదో పరిశీలించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
విద్యార్థిని శరీరం అంతటా తీవ్ర గాయాలు ఉన్నాయని, ఆమెను చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థినిని మతం మారాలని నిందితుడు బలవంతం చేయడాన్ని చాలా మంది విద్యార్థులు చూసినట్లు ఉజ్జెకిస్థాన్ దర్యాప్తు అధికారులు తెలిపారన్నారు. ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టడం వల్ల ఆమె చనిపోలేదని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు.