ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న రూ.1,200 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా ఇరాన్ బోటులో అక్కడి నుంచి పాకిస్థాన్‌కు హెరాయిన్‌ను రవాణా చేశారు. దీనిని భారత్, శ్రీలంకలో విక్రయించాలని భావించినట్లు భారత అధికారులు తెలిపారు. హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ బోటును, ఆరుగురు ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు భారత అధికారులు తెలిపారు. ఈ ఇరానియన్ బోట్ ద్వారా వాటర్‌ప్రూఫ్ సెవెన్ స్క్రీన్ ప్యాకేజింగ్‌లో డ్రగ్స్ రవాణా చేయబడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్‌లోని కార్టెల్‌లు వాటి ప్యాకెట్‌లపై ప్రత్యేకమైన గుర్తులను కలిగి ఉన్నాయి.
డ్రగ్ ప్యాకెట్లలో కొన్నింటిపై ‘స్కార్పియన్’ సీల్, మరికొన్నింటిపై ‘డ్రాగన్’ సీల్ గుర్తులు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీన్నుంచి ఒక శ్రీలంక బోటులోకి ఈ డ్రగ్స్‌ను తరలించాల్సి ఉందని, సదరు బోటును ట్రేస్ చేయడం కష్టంగా మారి ఉండేదని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ డ్రగ్స్ ముందుగా పాకిస్తాన్ తరలించారని, అక్కడ ఇరానియన్ బోటులో ఎక్కించి భారత్ తీసుకొచ్చినట్టుగా అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ ప్యాకెట్లపై ఉన్న గుర్తులు, ప్యాకింగ్ విధానం ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌లలోనే జరుగుతుందని నిర్ధారించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ మార్కెట్‌లో రూ.1200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
అయితే, శ్రీలంక నౌకను గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. ఇరాన్ నౌకలో ఉన్న వ్యక్తులు సముద్రంలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. హెరాయిన్‌ను కూడా నీటిలోకి విసిరేందుకు ప్రయత్నించినట్లు ఎన్‌సీబీ అధికారి సింగ్ తెలిపారు. భారత నేవీతో కలిసి ఆపరేషన్ చేపట్టిన ఎన్సీబీ అధికారులు ఈ డ్రగ్స్ షిప్‌మెంట్‌ను పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని కేరళలోని కోచి తీసుకొచ్చారు. అలాగే ఆరుగురు ఇరానియన్ దేశస్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..