Oxygen Shortage in Madhya Pradesh: కరోనావైరస్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. రెండురోజుల నుంచి రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఆక్సిజన్ కొరతతో మహారాష్ట్రలో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో కూడా ఆక్సిజన్ కొరతతో చాలామంది కరోనా రోగులు మరణించారు. షాదోల్ జిల్లా కేంద్రంలోని షాదోల్ మెడికల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 12 మంది రోగులు మరణించారు. శనివారం అర్థరాత్రి నుంచి రోగులు ఒక్కొక్కరిగా ఆరుగురు మరణించారని బంధువులు పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించారని మృతుల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
అయితే రాత్రి నుంచి ఆరుగురు మాత్రమే మరణించారని.. అంతకుమందు కూడా పలువురు ఆక్సిజన్ కొరతతో మరణించినట్లు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి మొత్తం 22 మంది చనిపోయినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఆసుపత్రి డీన్ మాట్లాడుతూ.. ఆరుగురు చనిపోయినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్ ఆసుపత్రికి చేరుకోని పరిశీలించారు. మొత్తం 12 మంది మరణించినట్లు ఆదివారం వెల్లడించారు. కాగా ఈ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. కరోనాతోనే వారంతా మృతిచెందారని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
ఇదిలాఉంటే.. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 11,269 కరోనా కేసులు నమోదయ్యాయి. 66 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు 4,491 మంది మరణించారు. 3.95 లక్షల మందికి వ్యాధి సోకగా.. వారిలో 3.27 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63,889 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
Also Read: