”నేనే శివుడిని.. నాకు కరోనా రావడమేంటి” తల్లి పద్మజ వింత చేష్టలు.. 32 గంటల్లోనే మారిన సీన్..
Madanapalle Incident: మదనపల్లి జంటహత్యల కేసు.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. తల్లిదండ్రులను అరెస్టు చేసినప్పటికీ… పద్మజ ప్రవర్తన...

Madanapalle Incident: మదనపల్లి జంటహత్యల కేసు.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. తల్లిదండ్రులను అరెస్టు చేసినప్పటికీ… పద్మజ ప్రవర్తన వింతగా అనిపిస్తోంది. ఓసారి తానే శివుడు అని, మరోసారి కరోనా సృష్టించిందే తానంటూ చెబుతుండడం ఆమె మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది. కూతుళ్లను చంపామన్న బాధ ఏ కోశానా ఎవరిలోనూ కనిపించడం లేదు. నిన్న కాసేపు పశ్చాత్తాపంతో ఉన్నారని అనిపించినా.. ఉదయానికే సీన్ మారిపోయింది.
కన్నబిడ్డలను హత్య చేసిన బాధ ఏ మాత్రం లేదు కదా.. శివుడి జటాజుటంలా తాను కూడా శివుడినే అంటూ చెప్పుకునే యత్నం చేస్తున్నారు. పోలీసుల ముందే పద్మజ వింత వింతగా ప్రవర్తిస్తూ.. కేకలు పెట్టారు. ‘శివ ఈజ్ బ్యాక్.. వర్క్ ఈజ్ డన్.. ఐయామ్ శివ’ అంటూ కేకలు పెడుతున్నారు. అరవకూడదని పోలీసులు చెప్పినప్పటికీ ఆమె మరింతగా అరుస్తూ ఆస్పత్రికి వెళ్లారు. అంతేకాదు.. తనను కరోనా ఏమి చేయలేదని కూడా పద్మజ గట్టిగా కేకలు వేయడం గమనార్హం.
కరోనా టెస్ట్ చేయించుకునేందుకు కూడా నిరాకరించిన పద్మజ.. ”నేనే శివుడిని.. నాకు కరోనా రావడమేంటి”.. ”కరోనాను సృష్టించింది చైనా కాదు నేనే సృష్టించానంటూ” వింత చేష్టలతో పద్మజ పోలీసులపై రుసరుసలు ఆడినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం ఈ ఇద్దర్నీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితులిద్దరిని పోలీసులు 32 గంటల తర్వాత అరెస్ట్ చేసి.. హత్య నేరం కింద కేసులు నమోదు చేశారు. ఏ1గా తండ్రి పురుషోత్తంనాయుడు, ఏ2గా తల్లి పద్మజ పేర్లను చేర్చారు.