AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే నీతికథ

బద్ధకంతో వదిలేసిన పని భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రతి పనిని నిబద్ధతతో చేస్తే విజయం తప్పకుండా దక్కుతుంది. ఈరోజు మీరు చేసే పనులే.. రేపు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఈ విషయాన్ని ఈ కింది కథ ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా చెబితే వారు సమయం వృద్ధా చేసుకోకుండా చదువుపై శ్రద్ధ పెడతారు..

Moral Story: మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే నీతికథ
Moral Story About Time
Srilakshmi C
|

Updated on: Sep 10, 2026 | 12:17 PM

Share

ఒక అందమైన నగరంలో ఒక రాజు ఉండేవాడు. తన ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తన రాజ్యంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేవాడు. అయితే కొంతకాలంగా రాజుకు తన దగ్గర పనిచేస్తున్న ముగ్గురు ముఖ్యమైన మంత్రులపై అనుమానం వచ్చింది. వారిలో ఒకరు రాజ్యానికి సంబంధించిన నిధులను సక్రమంగా ఉపయోగించడం లేదని, మరొకరు తన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్నారని రాజుకు అనిపించింది. కానీ అసలు నిజం ఎవరో తెలుసుకోవడం రాజుకు కష్టంగా మారింది. అందుకే ఒకరోజు ఆ ముగ్గురు మంత్రులను పిలిపించాడు. ‘త్వరలో నా పుట్టినరోజు రాబోతోంది. ఆ రోజు కోసం నాకు అడవిలో దొరికే మంచి పండ్లు కావాలి. మీ ముగ్గురూ ఒక్కొక్క బ్యాగ్ తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లండి. మంచి పండ్ల చెట్లను వెతికి, తాజా పండ్లతో మీ బ్యాగులను నింపుకుని సాయంత్రానికి తిరిగి రండి’ అని ఆదేశించాడు.

ముగ్గురు మంత్రులు బ్యాగులు తీసుకుని అడవికి బయలుదేరారు. మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు తనకు అప్పగించిన పని కాబట్టి దానిని శ్రద్ధగా చేయాలని అనుకున్నాడు. అడవంతా తిరిగి మంచి పండ్ల చెట్లను వెతికాడు. ఒక్కో పండును జాగ్రత్తగా పరిశీలించి, తాజాగా ఉన్న పండ్లను మాత్రమే కోసి బ్యాగులో వేసుకున్నాడు. చివరకు తన బ్యాగ్ మొత్తం మంచి పండ్లతో నింపుకుని సాయంత్రానికి రాజు దగ్గరకు చేరుకున్నాడు. రెండో మంత్రి కొంచెం తెలివిగా ఆలోచిస్తున్నానని అనుకున్నాడు. ‘రాజుగారికి ఇన్ని పండ్లను ఒక్కొక్కటిగా చూసే సమయం ఎక్కడ ఉంటుంది? బ్యాగ్‌లో పండ్లు ఉన్నాయా లేదా అనేదే చూస్తారు. కాబట్టి కష్టపడి చెట్లెక్కి తాజా పండ్లు కోయాల్సిన అవసరం లేదు’ అనుకున్నాడు. అతను చెట్లపై ఉన్న మంచి పండ్లను కోయకుండా, నేలపై పడిపోయిన పండ్లను ఏరడం ప్రారంభించాడు. అవి మంచివైనా, పాడైనవైనా పట్టించుకోకుండా బ్యాగ్ నింపుకున్నాడు.

మూడో మంత్రి మాత్రం బద్ధకానికి అలవాటుపడిన వ్యక్తి. అతనికి పని చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ‘రాజుగారు నా బ్యాగ్‌లో ఉన్న ప్రతి వస్తువును తనిఖీ చేయరు. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది’ అని అనుకున్నాడు. అతను పండ్ల కోసం వెతకడానికి కూడా కష్టపడలేదు. బ్యాగ్‌లో ఎండిపోయిన ఆకులు, చిన్న రాళ్లు వేసి నింపుకున్నాడు. సాయంత్రానికి ముగ్గురూ రాజు దగ్గరకు చేరుకున్నారు. రాజు వారి బ్యాగులను తీసుకున్నాడు. కానీ వాటిని తెరిచి చూడలేదు. ‘మీ ముగ్గురినీ ఒక నెల రోజుల పాటు వేర్వేరు గదుల్లో ఉంచండి. ఈ నెల రోజుల పాటు వారికి బయట నుంచి ఎలాంటి ఆహారం ఇవ్వకండి. వారు తెచ్చుకున్న బ్యాగుల్లో ఉన్న వాటినే ఆహారంగా తినాలి’ అని రాజు తన సైనికులను ఆదేశించాడు. ముగ్గురు మంత్రులు షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

నెల రోజుల తర్వాత.. మొదటి మంత్రి తన బ్యాగులో ఉన్న తాజా పండ్లను తింటూ ఆరోగ్యంగా నెల రోజులు గడిపాడు. రెండో మంత్రి తెచ్చిన పండ్లలో చాలా వరకు పాడైపోయి ఉన్నాయి. వాటిని తినడంతో అతనికి అనారోగ్యం వచ్చింది. తన తప్పును అప్పటికే గ్రహించాడు. ఇక మూడో మంత్రి పరిస్థితి మరింత దారుణంగా మారింది. అతని బ్యాగులో పండ్లు లేవు. కేవలం ఎండిపోయిన ఆకులు, రాళ్లు మాత్రమే ఉన్నాయి. అతను ఆకలితో అలమటిస్తూ.. ‘ఆ రోజు కొంచెం కష్టపడి మంచి పండ్లు తెచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడే నా పని నిజాయితీగా చేసి ఉంటే బాగుండేది’ అని పశ్చాత్తాపపడ్డాడు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది.

నీతి

ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. మన అలవాట్లే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈరోజు మనం చేసే చిన్న పని రేపు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అదే విధంగా ఈరోజు మనం బద్ధకంతో వదిలేసిన చిన్న పని కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు. ‘ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది?’ అని మనం అనుకోవచ్చు. కానీ కాలం గడిచిన తర్వాత.. ‘ఆ రోజు ఆ పని చేసి ఉంటే బాగుండేది’ అని బాధపడే పరిస్థితి రావచ్చు. కష్టపడి పైకి రావాలనుకునే వ్యక్తి తన పనిని నిజాయితీగా, నిబద్ధతతో చేస్తాడు. బద్ధకానికి అలవాటు పడిన వ్యక్తి మాత్రం అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుంటాడు. సమయం విలువ తెలుసుకోవాలి.

డబ్బును కోల్పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. వస్తువులను పోగొట్టుకుంటే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ గడిచిపోయిన సమయాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం. పేదవాడైనా, ధనవంతుడైనా, ఉద్యోగి అయినా, వ్యాపారి అయినా ప్రతి ఒక్కరికీ రోజులో 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటలను ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో వారి భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి పనిని వాయిదా వేయకండి. బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోకండి. మీకు అప్పగించిన ప్రతి పనిని నిజాయితీగా, శ్రద్ధగా చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు చేసే పనులే.. రేపు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి.

Follow Us
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..