
ఈ రోజుల్లో చాలా మంది ఫిట్‌నెస్ కోసం, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం వంటివి చేస్తున్నారు. అయితే యోగాను ప్రశాంతమైన ఆరుబయట వాతావరణంలో (బాల్కనీ లేదా మేడ పైన) చేసుకుంటే చాలా మంచిది. కానీ నగరాల్లో ఉండే స్థలాభావ పరిస్థితులు, లేదా దోమల భయం వల్ల చాలా మంది తమ ఇళ్ల లోపలే యోగా చేయాల్సి వస్తోంది.
అలా గదిలో యోగా చేసేటప్పుడు ఉక్కపోతగా అనిపించడమో లేదా చెమటలు పట్టడమో జరుగుతుందని చాలా మంది ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుంటారు. అయితే ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుని యోగా చేయడానికి ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తప్పుబడుతున్నారు. ఇలా యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు.
మనం యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు శరీరం లోపల వేడి పుడుతుంది. ఈ వేడి వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటకు విసర్జించబడతాయి. ఇది ఒక సహజమైన డీటాక్స్ ప్రక్రియ. మీరు ఫ్యాన్ వేసుకోవడం వల్ల వచ్చే గాలికి చర్మం చల్లబడుతుంది. దీనివల్ల శరీరానికి పట్టాల్సిన చెమట పట్టదు.. వ్యర్థాలు లోపల నుండి బయటకు పోయే ప్రక్రియ చాలా స్లో అయిపోతుంది.
మనం ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల రోజంతా ఏసీలు లేదా ఫ్యాన్ల కిందే కూర్చుంటాం. కనీసం యోగా చేసే ఆ అరగంట, గంట సేపైనా శరీరానికి చెమట పట్టకపోతే లోపలి వ్యర్థాలు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు.
మీరు గదిలో యోగా చేస్తున్నప్పుడు ఫ్యాన్ వేసుకోకుండా గది కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం మంచిది. దీనివల్ల గాలి లోపలికి, బయటికి ప్రవహిస్తూ ఉంటుంది.
ఫ్యాన్ లేకుండా యోగా చేసినప్పుడు చాలా చెమట పడుతుంది. ఈ చెమట వల్ల బాడీ డీటాక్స్ అయి, శరీరం లోపల పరిశుభ్రత పెరుగుతుంది. ఫలితంగా మీ ఒంటి దుర్వాసనలు తగ్గి, రోజంతా చాలా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా అనిపిస్తుంది.
శరీరం లోపలి వ్యర్థాలు బయటకు పోవాలంటే శరీరానికి చెమటలు పట్టాలి. కాబట్టి, ఇకపై యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ఫ్యాన్లు వేసుకోకుండా చేసేందుకు ప్రయత్నించండి.
Also Read: ఈ ఒక్క అలవాటు చాలు.. విజయం వైపు మీ ప్రయాణం మొదలైనట్టే!