
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అనేది కామన్‌గా మారిపోయింది. వారానికి సరిపడా కూరగాయలు తెచ్చి ఫ్రిజ్‌లో పెడతాం.. కానీ రెండు రోజులు గడవకముందే ఆకుకూరలు వాడిపోవడం, పచ్చిమిర్చి మెత్తబడటం లేదా టమాటాలు కుళ్ళిపోవడం చూస్తుంటాం. ఎంత ఖరీదైన ఫ్రిజ్ ఉన్నా ఈ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. అయితే దీనికి పరిష్కారంగా ఇప్పుడు వంటగదిలో ఒక సింపుల్ చిట్కా వైరల్ అవుతోంది. అదే డ్రై స్పాంజ్ ట్రిక్. వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న లాజిక్ వింటే మీరు కూడా వెంటనే ట్రై చేస్తారు
చాలామంది ఫ్రిజ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే కూరగాయలు పాడవవు అనుకుంటారు. కానీ అసలు విలన్ తేమ. రిఫ్రిజిరేటర్ లోపల, ముఖ్యంగా వెజిటబుల్ బాక్స్‌లో తేమ ఎక్కువగా పేరుకుపోతుంది. ఈ అధిక తేమ వల్ల బ్యాక్టీరియా, బూజు త్వరగా వృద్ధి చెంది ఆకుకూరలను వాడిపోయేలా లేదా జిగురుగా మార్చేస్తాయి.
పాత్రలు కడగడానికి వాడే సాధారణ స్పాంజ్‌కు నీటిని పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంటుంది. దీన్ని కూరగాయల డ్రాయర్‌లో ఉంచినప్పుడు అది చేసే పనులు ఇవే..
తేమ నియంత్రణ: బాక్స్‌లో పేరుకుపోయే అదనపు తేమను స్పాంజ్ వెంటనే పీల్చుకుంటుంది. దీనివల్ల కూరగాయల చుట్టూ వాతావరణం పొడిగా ఉండి, అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
దుర్వాసన దూరం: ఫ్రిజ్‌లో వచ్చే రకరకాల ఆహార పదార్థాల వాసనను కూడా ఈ స్పాంజ్ పీల్చుకుని దుర్వాసనను తగ్గిస్తుంది.
క్లీనింగ్ ఈజీ: డ్రాయర్ అడుగున నీరు నిలవడం, మురికి పేరుకుపోవడం వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. తద్వారా ఫ్రిజ్ శుభ్రం చేయడం సులభమవుతుంది.
పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలతో పాటు స్ట్రాబెర్రీలు, దోసకాయలు, క్యారెట్లు, క్యాప్సికమ్ వంటి వాటిని ఈ చిట్కా ద్వారా ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. ఖరీదైన కంటైనర్లు లేదా ప్రత్యేక బ్యాగులు కొనక్కర్లేకుండా కేవలం ఐదు రూపాయల స్పాంజ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.