నిద్ర మనకు చాలా ముఖ్యం. మంచి నిద్ర మనల్ని శక్తివంతంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట మంచి నిద్ర పోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తాజా పరిశోధన ప్రకారం, తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యను ప్రేరేపిస్తున్నట్లు తేలింది. అది క్రమేణా గుండెపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం, ఏడు గంటల కంటే తక్కువ నిద్ర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మనదేశంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ నిద్రపోతారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన తెల్లవారుజాముననే నిద్రలేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నిద్ర వల్ల స్త్రీల గుండె ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఏడు శాతం పెరుగుతుందని, నిద్ర వ్యవధి ఐదు గంటల కంటే తక్కువ ఉంటే 11 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది.
ఆరోగ్యకరమైన గుండెకు ఏడెనిమిది గంటల నిద్ర ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తరచుగా నిద్రలో మేల్కొనడం, పేలవమైన నిద్ర అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయం 16 అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో గత 5 సంవత్సరాలలో 6 దేశాల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజల నుంచి సేకరించిన డేటాను పరిశీలించారు. వీరిలో తక్కువ నిద్ర అలవాటు ఉన్నవారు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. అలాగే ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణమని వీరి పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ఎంత తక్కువ నిద్రపోతారో, భవిష్యత్తులో మీకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉందని డాక్టర్ కవే హొస్సేనీ చెప్పారు. అందువల్ల, ప్రతి రోజూ ఏడెనిమిది గంటల నిద్ర మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదేవిధంగా, మధుమేహం, ధూమపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని 20 శాతం పెంచుతాయి.