
రోజంతా కష్టపడి పనిచేశాక.. హాయిగా నిద్రపోతేనే కదా రేపటి పనులకు శరీరం సిద్ధమయ్యేది.. కానీ చాలామంది రాత్రిపూట లైట్లు వెలిగించి నిద్రపోతుంటారు. చీకటి అంటే భయంతోనో లేదా భద్రతా కారణాలతోనో ఈ అలవాటును కొనసాగిస్తుంటారు. అయితే ఈ చిన్న అలవాటు మీ ప్రాణాల మీదకు తెస్తుందని మీకు తెలుసా..? రాత్రిపూట వెలుతురులో నిద్రపోవడం వల్ల ఊబకాయం నుంచి క్యాన్సర్ వరకు అనేక ముప్పులు ఉన్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
మంచి నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అది ఆరోగ్యానికి పునాది. మనం నిద్రపోతున్నప్పుడే మన శరీరం, మనస్సు దెబ్బతిన్న కణాలను సరిచేసుకుంటాయి. సరిగ్గా నిద్ర లేకపోతే చిరాకు, మానసిక ఒత్తిడి కలగడమే కాకుండా.. దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం, ఆందోళన వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.
మన శరీరంలో సిర్కాడియన్ రిథమ్ అనే ఒక సహజ గడియారం ఉంటుంది. చీకటి పడగానే మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనల్ని గాఢ నిద్రలోకి తీసుకెళ్తుంది. కానీ రాత్రిపూట ప్రకాశవంతమైన వైట్ లైట్లు లేదా మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
వెలుతురులో నిద్రించడం వల్ల శరీర మెటబాలిజం తగ్గి బరువు పెరుగుతారు. మాటిమాటికీ మేల్కొలుపు రావడం వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుంది. మెలటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నేటి వేగవంతమైన జీవితంలో నిద్రను నిర్లక్ష్యం చేయకండి. రాత్రిపూట లైట్లు ఆర్పడం అనే ఒక చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది.