
ఖాళీగా ఉన్నప్పుడో, ఒత్తిడిలో ఉన్నప్పుడో తెలియకుండానే వేళ్లను నోట్లో పెట్టుకుని గోళ్లు కొరుకుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. మనకు ఇది కేవలం ఒక చెడు అలవాటులా అనిపించవచ్చు. కానీ వైద్య పరిభాషలో దీనిని డెర్మటోఫాజియా అని పిలుస్తారు. ఈ చిన్న అలవాటు చివరికి మీ వేలిని తొలగించే స్థాయికి తీసుకువెళ్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు లేదా వేళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కొరకడం అనేది ఒక రకమైన అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని వైద్యులు వర్గీకరిస్తున్నారు. తీవ్రమైన ఆందోళన లేదా ఒత్తిడికి గురైనప్పుడు మెదడును శాంతపరచుకోవడానికి చేసే ఈ ప్రయత్నం కాలక్రమేణా ఒక వ్యసనంగా మారుతుంది. దీనినే శరీరంపై దృష్టి సారించే పునరావృత ప్రవర్తన అని కూడా పిలుస్తారు.
ఈ అలవాటు వల్ల కలిగే నష్టాలు ఊహకందని విధంగా ఉంటాయి..
నెయిల్ బెడ్ నాశనం: నిరంతరం కొరకడం వల్ల గోరు పెరగడానికి సహాయపడే నెయిల్ బెడ్ దెబ్బతింటుంది. దీనివల్ల గోరు సరిగ్గా పెరగకుండా చర్మంలోకి లోతుగా కుంగిపోయి భరించలేని నొప్పిని కలిగిస్తుంది.
పరోనిషియా ఇన్ఫెక్షన్: గోళ్ల మూలల్లో ఉండే బ్యాక్టీరియా లాలాజలం ద్వారా రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల గోళ్ల చుట్టూ చీము పేరుకుపోయే పరోనిషియా ఇన్ఫెక్షన్ వస్తుంది.
గ్యాంగ్రీన్ ముప్పు: ఈ ఇన్ఫెక్షన్ ఎముకలోకి లోతుగా చేరితే, ఎముక కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. దీనినే గ్యాంగ్రీన్ అంటారు. పరిస్థితి విషమిస్తే ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకకుండా ఉండటానికి ప్రభావితమైన వేలిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి వస్తుంది.
మీరు లేదా మీ పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి..
గోళ్లను కత్తిరించుకోండి: గోళ్లను ఎప్పుడూ చాలా పొట్టిగా ఉంచుకోవడం వల్ల వాటిని కొరికే అవకాశం తగ్గుతుంది.
చేదు రుచి గల పేస్ట్: గోళ్ల చివర్లకు సురక్షితమైన, చేదుగా ఉండే పేస్ట్‌లను పూయండి. నోట్లో పెట్టుకోగానే ఆ చేదు వల్ల అలవాటు తగ్గుతుంది.
మానసిక ప్రశాంతత: ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ప్రాణాయామం లేదా వ్యాయామం చేయండి.
సమస్య అదుపు తప్పితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చర్మవ్యాధి నిపుణుడిని లేదా థెరపిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం.