
మనం ఆరోగ్యంగా ఉండటానికి అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాం. మరి మన చర్మం సంగతేంటి? రోజూ ఫేస్ వాష్, టోనర్, సిరమ్, మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్.. ఇలా డజన్ల కొద్దీ కెమికల్స్ మన ముఖంపై పూస్తూనే ఉంటాం. అయితే, వీటన్నింటికీ కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి, చర్మాన్ని తనంతట తానుగా కోలుకునేలా చేయడమే ఈ “స్కిన్ ఫాస్టింగ్”. ‘తక్కువ చేస్తేనే ఎక్కువ ఫలితం’ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
సాధారణంగా మనం వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వల్ల చర్మం సహజంగా ఉత్పత్తి చేయాల్సిన నూనెలను ఉత్పత్తి చేయదు. స్కిన్ ఫాస్టింగ్ అంటే మీరు వాడే అన్ని రకాల కాస్మెటిక్స్, క్రీములను కొన్ని రోజుల పాటు పూర్తిగా పక్కన పెట్టేయడం. దీనివల్ల మీ చర్మం మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. చర్మంలోని సహజమైన రక్షణ కవచం మళ్ళీ బలపడుతుంది.
కెమికల్స్ వాడకం ఆపడం వల్ల చర్మం తనను తాను శుభ్రపరుచుకుంటుంది. మీ చర్మం రకం (ఆయిలీ లేదా డ్రై) ఏంటో మీకు స్పష్టంగా తెలుస్తుంది. అతిగా ప్రోడక్ట్స్ వాడటం వల్ల వచ్చే అలర్జీలు లేదా చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. అనవసరమైన బ్యూటీ ప్రోడక్ట్స్ కొనాల్సిన పని ఉండదు.
కొన్ని రోజులు కేవలం గోరువెచ్చని నీటితో మాత్రమే ముఖం కడుక్కోవడం. ఏ రకమైన సోపులు లేదా క్రీములు వాడకూడదు. ఒకవేళ మీరు పూర్తిగా ఆపలేకపోతే.. కేవలం సన్ స్క్రీన్ మినహా మిగిలినవన్నీ ఆపేయవచ్చు. బయట నుంచి ఏమీ పూయడం లేదు కాబట్టి, లోపలి నుంచి చర్మం హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలి. అయితే, అందరికీ ఇది సెట్ అవ్వకపోవచ్చు. మొటిమలు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు ఉంటే.. డాక్టర్ సలహా లేకుండా స్కిన్ ఫాస్టింగ్ చేయకూడదు.
ఎప్పుడూ ఏదో ఒక క్రీమ్ ముఖానికి పూస్తూ చర్మాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేకంటే.. అప్పుడప్పుడు ఇలా స్కిన్ ఫాస్టింగ్ చేయడం వల్ల మీ ముఖం సహజంగా మెరిసిపోతుంది. మీ స్కిన్ కేర్ రొటీన్‌కు కూడా ఒక చిన్న హాలిడే ఇచ్చి చూడండి!