
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని ప్రతి అణువు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత కష్టపడినా చేతిలో రూపాయి నిలవకపోవడం, ఇంట్లో నిత్యం గొడవలు లేదా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? అయితే మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో దోషం ఉన్నట్లేనని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈశాన్యం అంటే దైవ మూల. ఈ దిశలో చేసే చిన్న చిన్న మార్పులు మీ తలరాతనే మార్చేయగలవు.
ఇంటికి ఈశాన్య దిశ అత్యంత పవిత్రమైనది. దీనిని సాక్షాత్తు దేవతల దిశగా, సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. ఈ మూల ఎంత ప్రశాంతంగా ఉంటే, ఆ ఇంట్లో అంతగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అందుకే వాస్తులో ఈశాన్యానికి పెద్దపీట వేశారు.
చాలామంది ఈశాన్య మూలలో పాత సామాన్లు, ఇనుప వస్తువులు లేదా బరువైన అల్మారాలు పెడుతుంటారు. ఇది వాస్తు ప్రకారం పెద్ద తప్పు. ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా, తేలికగా ఉండాలి. ఇక్కడ బరువైన ఫర్నిచర్ ఉంచితే అదృష్టం ఆగిపోతుంది. అలాగే ఈ మూలలో చెత్తను లేదా మురికిని ఉండనివ్వకండి.
ఇంటికి ఈశాన్య మూలలో గుడి లేదా పూజా గది ఉండటం అత్యంత శుభప్రదం. ప్రతిరోజూ ఇక్కడ దీపం వెలిగించి, సువాసనగల అగరబత్తులు వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల పురోగతికి బాటలు వేస్తుంది.
ఈశాన్యం జల తత్వానికి సంబంధించింది. ఈ దిశలో నీటి వనరులు ఉండటం సంపదను ఆకర్షిస్తుంది. ఒక చిన్న నీటి ఫౌంటెన్ లేదా అక్వేరియం లేదా కనీసం ఒక పాత్రలో స్వచ్ఛమైన నీటిని ఉంచండి. ఇది ధన ప్రవాహాన్ని పెంచుతుంది.
వెలుతురు.. గాలి.. ప్రశాంతత: ఈశాన్య మూల గదులకు లేత రంగులు వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కిటికీలు ఉండటం వల్ల సహజమైన వెలుతురు, గాలి ప్రసరించి ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. చీకటిగా ఉండే ఈశాన్యం మానసిక ఆందోళనలకు దారితీస్తుంది.