
ఇంట్లో కుక్కలను లేదా ఇతర పెంపుడు జంతువులను పెంచుకునేవారికి సెలవుల్లో పర్యటనలకు వెళ్లేటప్పుడు ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. తాము ఊరికి వెళ్తున్నప్పుడు వాటిని ఎక్కడ ఉంచాలి, ఎవరికి అప్పగించాలి అనే ఆందోళన వారిని వేధిస్తుంటుంది. చాలామంది తమ ప్రాణ సమానమైన పెట్స్‌ను తమతో పాటే ప్రయాణాలకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. సాధారణంగా సొంత కారు ప్రయాణం అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిని వెంట తీసుకెళ్లే వీలుంది. కానీ, బస్సు, రైలు, విమాన ప్రయాణాలలో పెట్స్‌ను తీసుకెళ్లడం కుదురుతుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. సరైన ప్రణాళిక, ముందస్తు ఏర్పాట్లు ఉంటే పెంపుడు జంతువులతో కలిసి దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
సుదీర్ఘమైన రైలు ప్రయాణాలు, గంటల తరబడి సాగే కారు ప్రయాణాలు లేదా విమాన ప్రయాణాలు మూగజీవులలో తీవ్రమైన గందరగోళాన్ని, భయాన్ని కలిగిస్తాయి. వాటి దినచర్య యజమానులకు బాగా తెలుసు కాబట్టి, దానికి తగిన విధంగానే ప్రయాణాన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణానికి కొన్ని రోజుల ముందు నుంచే వాటిని కారులో చిన్న చిన్న షికార్లకు తీసుకెళ్లడం అలవాటు చేయాలి. దీనివల్ల వాటికి జర్నీ చేయడం అలవాటు అవుతుంది. ప్రయాణ సమయంలో వీటికి తేలికపాటి భోజనం పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించడం వల్ల వాంతులు, నీరసం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ప్రయాణంలో కుక్కలు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించే పరుపులు, అవి ఆడుకునే బొమ్మలు, వాటికి బాగా అలవాటైన వస్తువులను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కొత్త పరిసరాలలోకి వెళ్లినప్పుడు జంతువులు ఆందోళనకు గురవుతాయి, కానీ తమకు తెలిసిన వస్తువులు పక్కన ఉంటే అవి త్వరగా ఆ వాతావరణానికి అలవాటుపడతాయి. ఆహారపు అలవాట్లలో ఆకస్మిక మార్పులు వచ్చినా, ఈ వస్తువుల ద్వారా వాటి మనసులోని అలజడిని కొంతవరకు నివారించవచ్చు.
కొన్ని నగరాలలో క్యాట్ కేఫ్‌లు, డాగ్ పార్కులు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే, కొత్త ప్రదేశంలో మీ పెట్స్‌ను అక్కడికి తీసుకెళ్లినంత మాత్రానా అవి వెంటనే అందరితో కలిసిపోతాయని చెప్పలేం. మన దేశంలో పెంపుడు జంతువులను ప్రేమించేవారు ఎక్కువే ఉన్నప్పటికీ, అన్ని హోటళ్లు కుక్కలను తమ గదుల్లోకి అనుమతించవు. కొన్ని హోటళ్లు కేవలం మార్కెటింగ్ కోసమే ‘పెట్స్‌కు అనుమతి’ అని బోర్డులు పెడుతుంటాయి. కాబట్టి ప్రయాణంలో పెట్స్ మనతో పాటే హాయిగా ఉండాలంటే ప్రైవేట్ విల్లాలు లేదా ఫామ్ హౌజ్‌లను బుక్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బీచ్‌లలో పెట్స్‌కు తగినంత స్వేచ్ఛ లభిస్తుంది.
అలాగే మహాబలేశ్వర్‌లోని బీచ్‌లు, కొండ ప్రాంతాల్లో చేసే ట్రెక్కింగ్, ప్రశాంతమైన వీధుల గుండా మీ పెట్స్‌తో కలిసి హాయిగా ప్రయాణించవచ్చు. మీతో పాటు మీ కుక్క సముద్రపు అలలతో ఆడుకోవడం, రోజంతా కొత్త అనుభవాల కోసం ఉత్సాహంగా అన్వేషించడం, అలసిపోయిన తర్వాత రాత్రి వేళల్లో మీ పక్కనే ముడుచుకొని విశ్రాంతి తీసుకోవడం.. పెట్‌తో చేసే ప్రయాణంలో ఇవన్నీ జీవితాంతం గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకి అయినా సులువుగా తొలగిపోతుందనే నమ్మకం మీలో కలుగుతుంది.