ఉత్తరాఖండ్‌లో ఉన్న చార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ చార్ ధామ్ లో ఏ ప్రదేశాలను సందర్శిస్తారు ఏ దైవాన్ని పూజిస్తారు తెలుసుకోవాలి. దీనితో పాటు ఈ చార్‌ధామ్ యాత్రలో మొదట ఏ ధామ్‌ను సందర్శించాలి,. వాటి ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..
కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్ర మొదలైంది. ఈ నేపధ్యంలో IRCTC అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ 2024 చార్ ధామ్ యాత్ర కోసం ప్యాకేజీని విడుదల చేసింది. యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో ఉన్న చార్‌ధామ్ దేవాలయం హిందువుల విశ్వాసానికి కేంద్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు చార్ ధామ్ ను సందర్శిస్తారు. ప్రపంచం నలుమూల్లోని భక్తులు ఈ ఆలయాల తలుపులు తెరవడం కోసం వేచి చూస్తున్నారు. ప్రతి హిందువు తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా చార్ ధామ్ ను సందర్శించాలని కోరుకుంటారు.
ఈ IRCTC ప్యాకేజీ మే 10 నుండి ప్రారంభమైంది. IRCTC ప్రయాణాన్ని నాలుగు భాగాలుగా విభజించింది. ఒక్కోసారి 20 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. మే 15న తొలి విడత భక్తులు బయలుదేరుతారు. ప్రయాణం 12 రోజులు ఉంటుంది. ఐఆర్‌సిటిసి తన వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పంచుకుంటూ యాత్రలో భక్తులకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. వాస్తవానికి, IRCTC ప్రతి సంవత్సరంచార్ ధామ్ యాత్ర ప్యాకేజీని విడుదల చేస్తుంది. దీనిని హిమాలయన్ చార్ ధామ్ యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ యాత్ర ఢిల్లీ నుండి బస్సులో చార్ ధామ్ యాత్రను (కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) చేయాల్సి ఉంటుంది. ప్రయాణం రెండవ దశ జూన్ నెలలో ప్రారంభమవుతుంది. అయితే మూడవ, చివరి రౌండ్ ప్రయాణం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరుగుతుంది.
ప్రయాణానికి మొత్తం ఎంత ఖర్చవుతుంది?
IRCTC ప్రయాణానికి టికట్ ధరల మొత్తాన్ని ఐదు భాగాలుగా విభజించింది, వీటిలో మూడు స్లాట్లు పెద్దలకు, రెండు పిల్లలకు కేటాయించబడ్డాయి. పెద్దవారిలో ఒంటరిగా ప్రయాణించే వారికి రూ.91,550లు చార్జ్ ని నిర్ణయించగా, ఇద్దరు వ్యక్తులు వెళ్తే వారికి రూ.57,000, ట్రిపుల్ షేరింగ్ కు రూ.54,490గా నిర్ణయించారు. కాగా పిల్లలకు (5-11 ఏళ్లు) బెడ్‌తో రూ.30,910, బెడ్ లేకుండా రూ.20,480గా నిర్ణయించారు.
ప్యాకేజీలో కల్పించనున్న సౌకర్యాలు
భక్తులు బస చేసేందుకు హోటల్ సౌకర్యం కల్పిస్తారు.
ప్యాకేజీలో అల్పాహారం, రాత్రి భోజన సదుపాయాలు ఉంటాయి.
GSTతో పాటు అన్ని ప్రభుత్వ పన్నులు ప్యాకేజీలో చేర్చబడతాయి.
ప్రయాణికులకు ప్రతిరోజూ ఒక లీటర్ వాటర్ బాటిల్ లభిస్తుంది.
ప్యాకేజీలో బీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
ప్యాకేజీలో ఏవి అందుబాటులో ఉండవంటే
- డిల్లీ వరకూ సొంత ఖర్చులతో వెళ్ళాల్సి ఉంటుంది. అదే విధంగా తిరిగి రావాల్సి ఉంటుంది.
- కేదార్ నాథ్ కు హెలికాప్టర్ ఛార్జీ అందుబాటులో ఉండదు.
- గైడ్ ఛార్జీలు సొంతంగా భరించాల్సి ఉంటుంది.
- టెలిఫోన్, డ్రింక్స్, రాఫ్టింగ్ వంటి వ్యక్తిగత ఖర్చులను ఎవరికీ వారే నిర్వహించుకోవాలి.
- ప్యాకేజీ కాకుండా, ఆహారం, పానీయాల ఖర్చులు మీరే భరించాలి.
ప్రయాణం ఎలా సాగుతుందంటే..?
- మొదటి రోజు- ప్రయాణం IRCTC ఢిల్లీలోని రైలు నివాస్ బిల్డింగ్ నుంచి హరిద్వార్‌కు బయలుదేరుతుంది. ప్రయాణికులు తమ సొంత డబ్బులతో దారిలో భోజనం చేయాల్సి ఉంటుంది. అయితే హరిద్వార్ చేరుకున్న తర్వాత విందు, రాత్రి బస ఏర్పాట్లు IRCTC చేస్తుంది.
- రెండవ రోజు- రెండో రోజు ఉదయం ప్రయాణికులు అల్పాహారం తీసుకున్న తర్వాత, బస్సు హరిద్వార్ నుంచి బార్కోట్‌కు బయలుదేరుతుంది. ఆ రోజు ప్రయాణికులు భోజనం చేసి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.
- మూడవ రోజు- మూడవ రోజు ఉదయం బస్సు జానకి ఛత్‌లో యమునోత్రి ఆలయ దర్శనానికి బయలుదేరుతుంది. జానకీ ఛత్ చేరుకున్న తర్వాత ప్రయాణికులు తమ సౌకర్యాన్ని బట్టి యమునా దేవి ఆలయాన్ని సందర్శించాల్సి ఉంటుది. ఆ తర్వాత అక్కడి నుంచి బర్కోట్‌కి తిరిగి వస్తారు.
- నాల్గో రోజు- ఉదయం బార్కోట్‌లో అల్పాహారం తర్వాత, బస్సు ఉత్తరకాశీకి బయలుదేరాల్సి ఉంటుంది. మార్గంలో ప్రతిపేశ్వర్ మహాకల్, కాశీ విశ్వనాథుడిని సందర్శించి అనంతరం ఉత్తరకాశీకి చేరుకుంటారు. రాత్రి ఉత్తరకాశిలోనే బస చేస్తారు.
- ఐదో రోజు – ఉదయం 5 గంటలకు ఉత్తరకాశీ నుంచి భాగీరథి నదిని పూజిస్తూ భక్తులు గంగోత్రి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ గంగాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత యాత్రికులు ఉత్తరకాశీకి తిరిగి వస్తారు.
- ఆరో రోజు- ఉదయం హోటల్ లో అల్పాహారం చేసిన తర్వాత ప్రయాణికులు గుప్తకాశీకి బయలుదేరుతారు. గుప్తకాశీ చేరుకున్న తరువాత ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి భోజనం , బస ఇక్కడే ఏర్పాటు చేస్తారు
- ఏడవ రోజు- ఉదయం 4 గంటలకు నిద్రలేచి యాత్రికులు సోన్‌ప్రయాగకు వెళ్ళాలి. అక్కడి నుంచి సొంత డబ్బులతో కేదార్‌నాథ్‌కు పల్లకీని బుక్ చేసుకుని గౌరీకుండ్ చేరుకోవాల్సి ఉంటుంది. కేదార్‌నాథ్‌ను సందర్శించిన తర్వాత అక్కడ విశ్రాంతి తీసుకోవాలి.
- ఎనిమిదవ రోజు – ఉదయం కేదార్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, భక్తులు అదే ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత గౌరీకుండ్ వరకు పాదయాత్రగా వెళ్ళాలి. అక్కడి నుంచి సోంప్రయాగ్ మీదుగా గుప్తకాశీ చేరుకుంటారు.
- తొమ్మిదో రోజు- తొమ్మిదో రోజు యాత్రికులు గుప్తకాశీ నుంచి బద్రీనాథ్ వెళతారు. బద్రీనాథ్ చేరుకున్న అనంతరం జోషిమఠ్‌లో కొలువై ఉన్న నరసింహ స్వామిని దర్శించుకుని అక్కడే రాత్రి బసచేయాల్సి ఉంటుంది.
- పదో రోజు : యాత్రలో 10 రోజు భక్తులు బద్రినాదుడిని దర్శనం చేసుకుని రుద్రప్రయాగకు బయలుదేరుతారు.
- యాత్ర 11వ రోజున భక్తులు రుద్రప్రయాగ నుంచి హరిద్వార్‌కు బయలుదేరుతారు. సాయంత్రం హరిద్వార్ దగ్గర గంగా హారతి చూసి అక్కడ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది
- యాత్రలో చివరి రోజు 12 వ రోజు బస్సు హరిద్వార్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతుంది. దీంతో 12 పగళ్లు, 11 రాత్రుల ధార్మిక యాత్ర ముగుస్తుంది.
హిమాలయన్ చార్ ధామ్ టూర్ ప్యాకేజీ అదనపు వివరాలు
- ఏదైనా కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే కంపెనీ పాలసీ ప్రకారం రీఫండ్ చేయబడుతుంది.
- ప్రయాణీకులు ప్రయాణం ప్రారంభానికి 60 నిమిషాల ముందు పికప్ పాయింట్‌కి చేరుకోవాలి.
- ఏదైనా వస్తువు విచ్ఛిన్నమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు