IRCTC Bali Package: బాలీ టూర్‌లో ఈ అద్భుత ప్రదేశాలన్నీ చూడొచ్చు.. పూర్తి టూర్ షెడ్యూల్ ఇదే!
IRCTC Bali Tour Package 2026 Telugu: బాలీ వెళ్లాలనుకునే వారికి IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 4 రాత్రులు, 5 రోజుల ఈ ప్యాకేజీ రూ.94,700 నుంచి ప్రారంభమవుతుంది. విమాన ప్రయాణం, 3-స్టార్ హోటల్ వసతి, భోజనం, వీసా, ఇన్సూరెన్స్‌తో పాటు బాలీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల సందర్శన కూడా ఇందులో ఉన్నాయి.

IRCTC Bali Tour Package Telugu: బాలీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, పచ్చని వరి పొలాలు, ప్రాచీన హిందూ దేవాలయాలు, రిసార్టులు, నైట్‌లైఫ్‌తో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో IRCTC బాలీకి 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు కొనసాగుతుంది. చెన్నై నుంచి విమాన ప్రయాణంతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఎకానమీ క్లాస్ విమాన టికెట్లు, 3-స్టార్ హోటల్‌లో 4 రాత్రుల వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్థానిక రవాణా, సందర్శనా స్థలాల ఎంట్రీ టికెట్లు, ఇంగ్లిష్ మాట్లాడే ప్రొఫెషనల్ గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూరిస్ట్ వీసా, GST, TCS వంటివి ప్యాకేజీలో ఉన్నాయి.
టూర్‌లో చూడగలిగే ప్రదేశాలు
- మొదటి రోజు బాలీ చేరుకున్న తర్వాత జింబరన్ బీచ్ సందర్శన ఉంటుంది.
- రెండో రోజు ఉబుద్, కింటామణి, మౌంట్ బాతుర్, లేక్ బాతుర్, సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, తిర్తా ఎంపుల్ ఆలయాన్ని సందర్శిస్తారు. బరోంగ్, కెరిస్ డ్యాన్స్‌లను కూడా వీక్షించవచ్చు.
- మూడో రోజు తంజుంగ్ బెనోవా బీచ్, టర్టిల్ ఐలాండ్, ఉలువాటు టెంపుల్, కెచక్ డ్యాన్స్, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
- నాలుగో రోజు తమన్ అయున్ టెంపుల్, ఉలున్ దాను బ్రటాన్ టెంపుల్, తానా లాట్ టెంపుల్ సందర్శిస్తారు.
ప్యాకేజీ ధర
కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.1,02,300, డబుల్ లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.94,700. 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.88,050, బెడ్ లేకుండా రూ.84,350గా ఉంది. ఈ ధరలో 2% TCS చేర్చారు.
అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్యాకేజీ మొత్తంలో 30 శాతం చెల్లించాలి. అంతర్జాతీయ ప్రయాణం కావడంతో పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఉండాలి. విమాన సమయాలు, హోటళ్లు, టూర్ షెడ్యూల్ వంటివి ఆపరేషనల్ పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉందని IRCTC పేర్కొంది.




