Stale Rice: మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త! ఫుడ్‌ పాయిజన్‌ అవ్వొచ్చు..

|

Jul 07, 2023 | 8:00 AM

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ ఉదయం తింటుంటారు. అలా తినడం వల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ మిగిలి పోయిన అన్నాన్ని నిల్వ చేసే విధానం, తిరిగి దానిని వేడి చేసి తినే విధానంలోనే తేడాలొస్తున్నాయి. సక్రమంగా దానిని భద్రపరచకపోతే అది ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే అవకాశం ఉంది.

Stale Rice: మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త! ఫుడ్‌ పాయిజన్‌ అవ్వొచ్చు..
Rice 4
Follow us on

మన దేశంలో ఎక్కువ మంది అన్నమే ఆహారంగా తింటుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మూడు పూట్ల కూడా అన్నం తినే వారు ఉన్నారు. ఎక్కువ శాతం మంది ఉదయం ఏదో టిఫిన్‌ చేసేసి, మధ్యాహ్నం, రాత్రి వేళ అన్నం తింటుంటారు. ప్రతి ఇంట్లో కూడా ఉన్న జనాభాను బట్టి బియ్యాన్ని కొలత వేసి అన్నం వండుతారు. కొన్ని సందర్భాల్లో వండిన అన్నం మిగిలిపోతుంటుంది. దానిని చాలా మంది వృథా కానివ్వరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న నానుడి ఉంది కదా! అందుకే అందరూ రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీ ఉదయం తింటుంటారు. అలా తినడం వల్ల ఎలాంటి సమస్య లేదు. కానీ మిగిలి పోయిన అన్నాన్ని నిల్వ చేసే విధానం, తిరిగి దానిని వేడి చేసి తినే విధానంలోనే తేడాలొస్తున్నాయి. సక్రమంగా దానిని భద్రపరచకపోతే అది ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయాలి..

మనం తినే బియ్యంతోనే శరీరానికి శక్తి వస్తుంది. కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే ఎప్పుడూ వేడి వేడిగా వండిన అన్నాన్ని తీసుకోవడం ఉత్తమం. మిగిలి పోయిన అన్నాన్ని చల్దిగా మార్చి తిన్నా ఆరోగ్యమే. కానీ దానిని సక్రమైన పద్ధతిలో నిల్వ చేయకపోతేనే సమస్య ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి బియ్యాన్ని సరైన విధానంలో, సక్రమమైన ఉష్ణోగ్రతలో వండి.. దానిని మంచిగా నిల్వ చేస్తే అది మూడు, నాలుగు రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది. అన్నం వండిన తర్వాత కొన్ని గంటల వరకూ మాత్రమే అది తాజాగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు చేరుతాయి. అందుకే అన్నం వండిన తర్వాత గంట నుంచి మూడు గంటల్లోపు తినేయాలని, ఆ తర్వాత దానిపై సూక్ష్మ జీవులు చేరే ప్రమాదం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే గది ఉష్ణోగ్రత వద్ద అన్నాన్ని ఎక్కువ సేపు ఉంచకూడదు. మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్‌లో భద్రపరచాలి. అది కూడా ఐదు డిగ్రీల సెల్సీయస్‌ లేదా అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే అది మూడు, నాలుగు రోజుల వరకూ కూడా వాడుకోవచ్చు. అయితే దానిని తిరిగి వినియోగించేటప్పుడు కూడా సరియైన విధానంలో తిరిగి వేడి చేసుకోవాల్సి ఉంటుంది.

తిరిగి వేడి చేసేటప్పుడు..

మీరు ఫ్రిడ్జ్‌లో అన్నాన్ని నిల్వ చేసినా.. దానిని తిరిగి వినియోగించేటప్పుడు కచ్చితంగా వేడి చేసుకోవాలి. అది కూడా ఓ క్రమమైన పద్ధతిలోనే. అలాకాకుండా సరియైన విధానంలో ఫ్రిడ్జ్‌ ఉంచిన అన్నాన్ని వేడి చేస్తే బ్యాక్టీరియాకు అది ఆవాసంగా మారిపోతుంది. ఈ బ్యాక్టీరియా వేడి చేసినంత మాత్రన పోదు. ఆ అన్నాన్ని తినడం వల్ల కడుపులోకి చేరి ఫుడ్‌ పాయిజన్‌ కు కారణమవుతుంది. ఫలితంగా డయేరియా, వాంతులు వంటివి వస్తాయి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అదేంటే వేడి అన్నాన్ని ఫ్రిడ్జ్‌ లో పెట్టకూడదు. అలాగే ఫ్రిడ్జ్‌ నుంచి తీసిన వెంటనే అన్నాన్ని వేడి చేయకూడదు. తగినంత సమయాన్ని ఇవ్వాలి.

ఇవి కూడా చదవండి

పాడైన అన్నాన్ని ఎలా గుర్తించాలి..

అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం సులభంగా బ్యాక్టీరియాలకు లోనవుతుంది. అది బ్యాక్టీరియా సంతానోత్పత్తి కేంద్రంగా మారిపోతుంది. అన్నం పొడిగా మారడం, బూజు పట్టడం, దుర్వాసన రావడం, రంగు మారడం వంటివి కనిపిస్తే అన్నం పాడైపోయినట్లు గుర్తించాలి. అలాగే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో పురుగులు పడితే ఆ బియ్యం కూడా పాడైనట్లు గుర్తించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..