
యూనివర్సిటీ ఆఫ్ బాన్ పరిశోధకులు కిచెన్ స్పాంజ్‌ల ప్రభావంపై సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఇందుకోసం ‘స్పాంజ్‌బాట్’ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి పరీక్షలు నిర్వహించారు. సగటున ఒక వ్యక్తి వాడే స్క్రబ్బర్ల వల్ల ఏడాదికి 0.68 గ్రాముల నుంచి 4.21 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ నీటిలో కలుస్తున్నాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ స్పాంజ్‌లను వాడుతుండటంతో, ఇది వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలుగా మారుతోంది. ఇవి డ్రైనేజీ వ్యవస్థల ద్వారా నదులు, సముద్రాల్లోకి చేరి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.
ఈ పరిశోధనలో ప్లాస్టిక్ కంటే మించిన మరొక ఆందోళనకరమైన నిజం బయటపడింది. గిన్నెలు కడిగే ప్రక్రియలో పర్యావరణానికి జరుగుతున్న మొత్తం నష్టంలో, మైక్రోప్లాస్టిక్స్ వాటా కంటే నీటి వృథా వాటాయే అత్యధికమని శాస్త్రవేత్తలు గుర్తించారు. చేత్తో అంట్లు తోమేటప్పుడు ట్యాప్ ఆన్ చేసి ఉంచడం వల్ల జరిగే పర్యావరణ నష్టం ఏకంగా 85 నుండి 97 శాతం వరకు ఉంటుందట. మనం నిరంతరం వృథా చేస్తున్న నీరు, ప్లాస్టిక్ స్పాంజ్ కంటే పెద్ద ముప్పును కలిగిస్తోంది.
ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన వంటగదిని నిర్మించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆధునిక సౌకర్యాల కంటే మన పర్యావరణం ముఖ్యం. ప్రకృతికి మేలు చేసే పాతకాలపు అలవాట్లను మళ్ళీ మన జీవితంలోకి ఆహ్వానిద్దాం. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, నీటిని పొదుపు చేస్తూ భవిష్యత్తు తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందిద్దాం.