Salt: ఏ వయస్సు వారు ఎంత ఉప్పు తీసుకోవాలి.. ఉప్పు తగ్గించే చిట్కాలేంటంటే

|

Oct 18, 2024 | 10:30 AM

ప్రతీ ఒక్క వంటకంలో ఉపయోగించే ఉప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎంత నిజం ఉందో.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కూడా చూపుతుందనడంలో కూడా అంతే నిజం ఉంది. అందుకే ఉప్పును మోతాదుకు మించి తీసుకోకూడదని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఏ వయసు వారు, ఎంత ఉప్పు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Salt: ఏ వయస్సు వారు ఎంత ఉప్పు తీసుకోవాలి.. ఉప్పు తగ్గించే చిట్కాలేంటంటే
Salt
Follow us on

ఉప్పు లేని కూరను ఊహించుకోవడం కూడా కష్టమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కూరకు రుచిని అందించడంలో ఉప్పుదే కీలక పాత్ర. ఎన్ని రకాల మసాలాలు వేసినా ఉప్పు లేకపోతే కూరకు రుచి లభించదు. నిజానికి శరీరానికి కచ్చితంగా ఉప్పు లభించాల్సిందే. అయితే మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు అధికంగా తీసుకునే వారిలో అధిక రక్తపోటుతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలంలో కడుపు క్యాన్సర్‌కు కూడా ఉప్పు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం శాతం పెరుగుతుంది. ఇది పక్షవాతానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అందుకే ఉప్పును మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే తీసుకునే ఉప్పు వయసుపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్దలు రోజూ 6 గ్రాములకు మించిన ఉప్పును తీసుకోకూడదని అంటున్నారు. ఇక పిల్లల విషయానికొస్తే వారి వయసు ఆధారంగా 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇంతకు మించి ఉప్పు తీసుకుంటుంటే ఆరోగ్యంపై ప్రభావం పడడం ప్రారంభమవుతుంది. తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నం తినే చోట లేదా డైనింగ్‌ టేబుల్‌పై ఎట్టి పరిస్థితుల్లో ఉప్పును పెట్టుకోకూడదు. దీనివల్ల కూరలో ఉప్పు తక్కువగా ఉందన్న భావనతో వేసుకుంటారు. ఉప్పుకు బదులుగా వీలైనంత వరకు ఛాట్​ మసాలా, యాలకుల పొడి వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇక సాయంత్రం స్నాక్స్ తయారీలో ఉప్పుకు బదులుగా.. దాల్చిన చెక్క పొడి, నల్లమిరియాల పొడి, యాలకుల పొడిని ఉపయోగిస్తే ఉప్పు వినియోగం తగ్గుతుంది. ఇవి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తాయి. అయితే ఒకేసారి కాకుండా క్రమంగా ఉప్పును తగ్గిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్యాకేజ్‌ చేసిన ఫుడ్‌ను తీసోకూడదు. ఇక నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..