
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ. తేలికగా అరిగే ఆహారం కావడంతో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఇంట్లో తయారు చేసే ఇడ్లీలు కొన్నిసార్లు గట్టిగా లేదా సరిగ్గా ఉడకకుండా వస్తుంటాయి. హోటల్లో దొరికే దూది లాంటి స్పాంజీ ఇడ్లీలను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి కొన్ని సులువైన చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం.
మృదువైన ఇడ్లీలకు మొదటి రహస్యం సరైన నిష్పత్తి. 1 కప్పు పొట్టు తీసిన మినపప్పుకి 2 లేదా 2.5 కప్పుల ఇడ్లీ రవ్వను ఎంచుకోవాలి. పప్పు నాణ్యతను బట్టి ఈ నిష్పత్తి మారుతుంది. పప్పును కనీసం 4-5 గంటలు, రవ్వను 2-3 గంటల పాటు విడివిడిగా నానబెట్టుకోవాలి.
పప్పు నానబెట్టే సమయంలో ఒక టీస్పూన్ మెంతులు వేస్తే ఇడ్లీలు తెల్లగా రావడమే కాకుండా పిండి బాగా పులుస్తుంది. అలాగే పప్పు రుబ్బేటప్పుడు అర కప్పు నానబెట్టిన అటుకులు లేదా కొద్దిగా అన్నం కలిపి రుబ్బితే ఇడ్లీలు అద్భుతమైన స్పాంజీ రూపంలోకి వస్తాయి.
మినపప్పును రుబ్బేటప్పుడు ఒకేసారి నీళ్లు పోయకూడదు. కొద్దికొద్దిగా చల్లటి నీరు చల్లుతూ రుబ్బడం వల్ల పిండి వేడెక్కకుండా బాగా పొంగుతుంది. పిండి వెన్నలా మెత్తగా వచ్చే వరకు రుబ్బాలి.
రుబ్బిన మినపపిండిలో నానబెట్టిన రవ్వను బాగా పిండి కలపాలి. ఈ పిండిని కనీసం 8-10 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. చలికాలంలో పిండి త్వరగా పులియదు కాబట్టి ఓవెన్ లోపల లేదా లైట్ కింద ఉంచడం మంచిది. పిండి బాగా పొంగితేనే ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
ఇడ్లీ పాత్రలో నీరు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్లను లోపల ఉంచాలి. మీడియం మంటపై సరిగ్గా 10 నుండి 12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువ సమయం ఉడికిస్తే ఇడ్లీలు గట్టిపడతాయి. పొయ్యి ఆపిన తర్వాత 2 నిమిషాలు ఆగి ప్లేట్లను బయటకు తీసి, నీళ్ల తడి చేసిన స్పూన్‌తో తీస్తే ఇడ్లీలు ప్లేట్‌కు అంటుకోకుండా నీట్‌గా వస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..