ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచండిలా..! ఈ సింపుల్ చిట్కాలు మీకోసం..!

|

Mar 16, 2025 | 4:33 PM

ఏసీ లేకుండా ఇంటిని చల్లగా ఉంచడానికి సహజమైన మార్గాలను అనుసరించాలి. కిటికీల ఏర్పాటు, మొక్కల పెంపకం, వెదురు చాపలు వాడటం, వైట్ వాష్ చేయడం వంటి చిట్కాలు వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఇంటి పైకప్పు, గదుల ఏర్పాటును సరిచేసుకోవడం వల్ల ఇంట్లో సహజమైన చల్లదనం పొందవచ్చు.

ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచండిలా..! ఈ సింపుల్ చిట్కాలు మీకోసం..!
Natural Ways To Beat Heat
Follow us on

వేసవి కాలంలో ఎండల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇంట్లో ఏసీ ఉంటే వెచ్చదనాన్ని ఆపవచ్చు. కానీ ఏసీ లేకపోతే ఫ్యాన్ ఎంత నడిసినా వేడి తగ్గదు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా ఇప్పుడు ఎండ తీవ్రంగా ఉంటుంది. ఇంటిని సహజంగా చల్లగా ఉంచే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇంట్లో గాలి సరిగా తిరిగేలా చూడాలి. కిటికీలు వ్యతిరేక దిశలలో ఉంటే గాలి సులభంగా ప్రవహిస్తుంది. ఉదయం, సాయంత్రం కిటికీలు తెరిచేలా ఉంటే చల్లని గాలి లోపలకి వస్తుంది. ఇది గదిలోని ఉష్ణోగ్రత తగ్గించడంలో సహాయపడుతుంది.

ఏసీ లేకపోతే ఫ్యాన్ ముందు ఐస్ ఉంచడం ద్వారా కొంత చల్లదనం పొందవచ్చు. టేబుల్ ఫ్యాన్ ముందు ఐస్ లేదా చల్లని నీటితో కూడిన గిన్నె ఉంచాలి. ఫ్యాన్ గాలి ఆ నీటిని తాకి చల్లగా అనిపిస్తుంది. అయితే దీని వల్ల కొందరికి జలుబు సమస్యలు రావచ్చు.

అందంగా కనిపించడమే కాకుండా వేడి ప్రభావాన్ని తగ్గించడానికి కిటికీలకు తీగ మొక్కలు పెంచడం మంచిది. అవి వేడి నుంచి గదిని రక్షిస్తాయి. పచ్చదనంతో కూడిన కిటికీలు గాలి తేమను నిల్వ ఉంచి చల్లగా ఉంచుతాయి.

ఇప్పుడు చాలా మంది ఇంటి పైకప్పులపై మొక్కలు పెంచుతున్నారు. చిన్న ప్రదేశంలో పెరిగే పండ్ల చెట్లు, తీగ మొక్కలు ఉంటే వేడి ప్రభావం తగ్గుతుంది. పైకప్పుపై మొక్కలు పెంచడం వల్ల ఇంట్లోకి నేరుగా సూర్యరశ్మి తాకకుండా ఉండి చల్లదనం మెరుగవుతుంది.

వెదురు సహజంగా వేడి నిరోధకత కలిగి ఉంటుంది. తలుపులు, కిటికీల దగ్గర వెదురు చాపలు వేలాడదీయడం వల్ల వేడి లోపల ప్రవేశించదు. ఇది గదిలోని ఉష్ణోగ్రతను తగ్గించి చల్లగా ఉండేలా చేస్తుంది.

ఇంటి పైకప్పును తెల్లగా చేయడం వల్ల వేడిని నివారించవచ్చు. తెలుపు రంగు కాంతిని ప్రతిబింబిస్తుంది. దీంతో ఇంట్లోకి వేడి తగ్గుతుంది. వేసవికి ముందుగా వైట్ వాష్ చేయడం కొంతవరకు సహాయపడుతుంది.

సూర్యుడి కిరణాలు నేరుగా గదిలోకి రాకుండా ఉండేందుకు కర్టెన్లు ఉపయోగించాలి. ఇంట్లో పుస్తకాలు, కాగితాలు, ఫర్నిచర్ లాంటి వేడిని నిల్వ ఉంచే వస్తువులను సర్దుబాటు చేయడం వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. కిటికీలు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుంది.