
వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల (Heatwaves) నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి పచ్చి ఉల్లిపాయలు (Raw Onions) తినడం ఒక సాంప్రదాయక నివారణోపాయంగా వస్తోంది. అయితే, తీవ్రమైన వేడిలో దీనిని తినడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి, పచ్చి ఉల్లిపాయలలో నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా, ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలోని క్వెర్సిటిన్’ (Quercetin) అనే యాంటీఆక్సిడెంట్ వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. కానీ, వీటిని అతిగా తీసుకోవడం వల్ల కొందరిలో జీర్ణ సమస్యలు లేదా గుండెల్లో మంట వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎండ తీవ్రతను తట్టుకోవడానికి పచ్చి ఉల్లిపాయలను ఎలా తీసుకోవాలో ప్రముఖ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా వివరాలు వెల్లడించారు.
శరీరాన్ని చల్లబరుస్తుంది: పచ్చి ఉల్లిపాయలలో నీటి శాతం (Water content) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. సహజంగానే శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
వడదెబ్బ నుండి రక్షణ: ఉల్లిపాయలలో క్వెర్సిటిన్ (Quercetin) అనే శక్తివంతమైన ఫ్లేవనాయిడ్/యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరానికి వడదెబ్బ (Heat stroke) తగలకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేసవి అలసటను తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తి పెంచుతుంది: ఎండల కాలంలో బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, పొట్ట ఖరాబు కావడం వంటి సమస్యలు ఎక్కువ. ఉల్లిపాయలలో ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తాయి. కానీ అతిగా తినడం మంచిది కాదు. తీవ్రమైన ఎండల సమయంలో పచ్చి ఉల్లిపాయలను పరిమితంగా తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట: ఉల్లిపాయలలో ఫ్రక్టాన్స్ (Fructans) అనే కార్బోహైడ్రేట్లు, సహజ ఆమ్లాలు ఉంటాయి. వేసవిలో జీర్ణవ్యవస్థ ఇప్పటికే కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పచ్చి ఉల్లిపాయలను అతిగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట (Acid reflux) వంటి సమస్యలు తలెత్తవచ్చు.
నోటి దుర్వాసన: ఎండ తీవ్రతకు శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది. ఆ సమయంలో పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే నోరు మరింత ఎండిపోయి, తీవ్రమైన నోటి దుర్వాసనకు దారితీస్తుంది.
పచ్చి ఉల్లిపాయలను నేరుగా అలాగే తినడం కంటే, వాటిపై కొద్దిగా నిమ్మరసం చల్లుకుని లేదా పెరుగు/మజ్జిగతో కలిపి సలాడ్ లాగా (రైతా) తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఉల్లిపాయల ఘాటు తగ్గి, శరీరానికి రెట్టింపు చలవ లభిస్తుంది. తీవ్రమైన ఎండల్లో పచ్చి ఉల్లిపాయలను పూర్తిగా దూరం పెట్టాల్సిన పనిలేదు. రోజువారీ భోజనంలో కొద్ది మొత్తంలో (పరిమితంగా) భాగం చేసుకోవడం వల్ల వడదెబ్బ నుండి సురక్షితంగా ఉండవచ్చు. ఒకవేళ మీకు సున్నితమైన పొట్ట లేదా గ్యాస్ సమస్యలు ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త వహించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..