Myths and Facts: చేపలు, పెరుగు ఒకేసారి తినకూడదా? సైన్స్ ఏం చెబుతోంది..?

Fish Curry and Curd Rice Combination: చేపల కూర తిన్న తర్వాత పెరుగన్నం తినకూడదనే నమ్మకం చాలా కాలంగా ఉంది. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి? చేపలు, పెరుగు కలిపి తింటే నిజంగానే చర్మవ్యాధులు వస్తాయా? సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధునిక వైద్యశాస్త్రం ఈ అంశంపై ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి.

Myths and Facts: చేపలు, పెరుగు ఒకేసారి తినకూడదా? సైన్స్ ఏం చెబుతోంది..?
Fish And Curd Rice
Image Credit source: Pexels

Updated on: Jul 04, 2026 | 11:53 AM

పెరుగన్నంతో చేపలు నంజుకోవడం, చేపల కూర తిన్న తర్వాత వెంటనే పెరుగన్నం తినకూడదని మన ఇళ్లలో పెద్దలు తరచూ చెబుతుంటారు. ఈ నమ్మకం ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కొనసాగుతోంది. అయితే దీనికి నిజంగా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? లేక ఇది కేవలం సంప్రదాయమా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చేపల కూరను సాధారణంగా చింతపండు లేదా ఇతర పుల్లటి పదార్థాలతో తయారు చేస్తారు. దీంతో ఆ కూరలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆహారం తింటే జీర్ణం కావడానికి కడుపు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అయితే దీంతో ఆరోగ్యవంతులకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.

పెరుగు పాలలోని బ్యాక్టీరియా ద్వారా పులియబెట్టిన ఆహారం. కొంత సమయం గడిచిన తర్వాత ఇది మరింత పుల్లగా మారుతుంది. అందువల్ల చేపల కూరతో పాటు వెంటనే పెరుగన్నం తింటే కొందరిలో అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యం కలిగే అవకాశముంది. అయితే ఇలా తింటే ప్రతి ఒక్కరికీ ఆ సమస్యలు ఏర్పడే అవకాశం లేదు. కొందరు చేపలు, పెరుగన్నం కలిపి తిన్నా ఎలాంటి అజీర్ణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు.

చేపలు, పెరుగు కలిపి తింటే సోరియాసిస్, చర్మవ్యాధులు వస్తాయని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. కానీ ఇప్పటివరకు దీనిని నిర్ధారించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. సోరియాసిస్ అనేది జన్యుపరమైన, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. చేపలు, పెరుగు కలిసి తింటే సొరియాసిస్ వస్తుందని వైద్య శాస్త్రం చెప్పడం లేదు.

ఆయుర్వేదం ఏమి చెబుతోంది?

ఆయుర్వేదంలో చేపలు – పెరుగు కలయికను విరుద్ధ ఆహారంగా పేర్కొంటారు. ఈ కలయిక కొందరిలో జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి. అయితే దీన్ని ఆధునిక వైద్య శాస్త్రం పూర్తిగా అంగీకరించడం లేదు.

Also Read: బరువు తగ్గేందుకు, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్? అసలు తేడా ఇదే..

చేపల కూర తిన్న తర్వాత పెరుగన్నం తినకూడదనే నమ్మకం ప్రధానంగా మన పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయం, ఆయుర్వేద శాస్త్రంపై ఆధారపడి ఉంది. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తులు చేపలు, పెరుగు కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు, చర్మవ్యాధులు వస్తాయని నిర్ధారించే ఆధారాలు లేవు. అయితే అజీర్ణం, గ్యాస్, ఇతర ఉదర సమస్యలు ఉన్నవారు చేపల కూర, పెరుగు ఒకేసారి తీసుకోకుండా ఉండటం మంచిది. మీ శరీరానికి ఏది అనుకూలంగా ఉంటుందో గమనించి ఆహారపు అలవాట్లను ఏర్పరచుకోవడం ఉత్తమం. అందుకే మనకు నప్పేవి ఎప్పుడైనా తినొచ్చు..నప్పనివి ఎప్పుడూ తినకూడదని గ్రహించాలి.

(నోట్: కొందరు నిపుణులు ఇంటర్నెట్‌లో పంచుకున్న అంశాల ఆధారంగా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు నేరుగా వైద్య నిపుణులను సంప్రదించాలి)

Follow Us