Telugu News Lifestyle Oxford Longevity Formula: 5 Daily Habits for a Longer Life Details in Telugu
Longivity: ఆరోగ్యంగా 100 ఏళ్లు జీవించాలా..? ఆక్స్‌ఫర్డ్ నివేదికలోని కీలక అంశాలు
Daily Habits For Longivity: ఆరోగ్యంగా, చురుకుగా వందేళ్లు జీవించాలనుకుంటున్నారా..? వృద్ధాప్యాన్ని ఆనందించాలనుకుంటున్నారా? ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల తాజా నివేదిక ప్రకారం దీర్ఘాయుష్షుకు 5 అలవాట్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టాలని సూచించారు. నాణ్యమైన నిద్ర, సానుకూల దృక్పథం, క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారం, ఒత్తిడి నియంత్రణ వంటి 5 అలవాట్లు దీర్ఘాయుష్షుకు కీలకం. ఆరోగ్యకరమైన జీవితానికి ఇప్పటి నుంచే ఈ మార్పులను ప్రారంభించండి.
ఎక్కువ కాలం జీవించడం కంటే ఆరోగ్యంగా, చురుకుగా జీవించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు రూపొందించిన “ఆక్స్‌ఫర్డ్ లాంగెవిటీ ప్రాజెక్ట్” నివేదిక యవ్వనాన్ని ఎక్కువ కాలం నిలబెట్టేందుకు అవసరమైన ఐదు ముఖ్యమైన అలవాట్లను వెల్లడించింది. వీటిని సులభంగా గుర్తుంచుకోవడానికి S-MEDs అనే పేరును ఇచ్చారు. వీటిని అలవరుచుకోవడం ద్వారా మీలో వృద్ధాప్య ఛాయలను వాయిదావేయొచ్చు..లేదా వృద్దాప్యంలోనూ యవ్వనంగా గడపవచ్చు.
దీర్ఘాయుష్షుకు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 5 రోజువారీ అలవాట్లు ఇవే..
Sleep (నిద్ర): ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర ఎంతో ముఖ్యం. ఇది మన గుండె, మెదడు, నాడీ వ్యవస్థను కాపాడుతుంది. పడుకునే ముందు మొబైల్, టీవీలకు దూరంగా ఉండటం మంచిది. వయోజనులు రోజూ ఏడు గంటల నుంచి 9 గంటల పాటు నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Mindset (సానుకూల దృక్పథం): జీవితంపై సానుకూల దృక్పథం, బలమైన సామాజిక సంబంధాలు, స్పష్టమైన జీవిత లక్ష్యం మనసును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ శారీరకంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగానూ ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.
Exercise (వ్యాయామం): ఆరోగ్యకరమైన జీవితానికి వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక, ఈత, డ్యాన్స్ లేదా గార్డెనింగ్ వంటి కార్యకలాపాలు కండరాలు, ఎముకలను దృఢంగా ఉంచుతాయి. వయసుతో పాటు వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను దూరంగా ఉంచేందుకు శారీరకంగా యాక్టివ్‌గా ఉండాలి.
Diet (ఆహారం): కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, గింజలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ప్లాంట్-బేస్డ్ ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలను తగ్గించడం అవసరం.
Stress Reduction (ఒత్తిడి నియంత్రణ): దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి గుండె జబ్బులు, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, ప్రకృతిలో గడపడం వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
మరిన్ని సలహాలు:
ఇవే కాకుండా పొగత్రాగడం, మద్యపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని నివేదిక పేర్కొంది. నిపుణుల సూచనల మేరకు వృద్ధాప్యాన్ని ఆపలేకపోయినా, నేటి నుంచి మంచి అలవాట్లు అలవరచుకోవడం ద్వారా వృద్ధాప్యంలోనూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.