
సాధారణంగా మనం అన్నం మిగిలితే పడేస్తూ ఉంటాం.. కానీ, మిగిలిన అన్నాన్ని సద్వినియోగం చేసుకుని, అద్భుతమైన రుచితో కరకరలాడే వడియాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ వడియాలు తయారు చేయడానికి బియ్యప్పిండి, రవ్వ, లేదా గంజి కాచే పని అస్సలు అవసరం లేదు. స్టవ్ తో పనిలేకుండానే, సులభంగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడియాలను ఒక సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి సైడ్ డిష్‌గా లేదా సాయంత్రం పూట స్నాక్స్‌గా పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉంటాయి. మగవారు సైతం కూడా ఈ వడియాలు ఈజీగా పెట్టేస్తారు.
అన్నం ఎంపిక: వడియాలు ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు అన్నాన్ని తీసుకోవాలి. ఇది నైట్ మిగిలిన అన్నం అయినా పర్వాలేదు. లేదా తాజాగా వండి చల్లార్చిన అన్నం అయినా తీసుకోవచ్చు. అన్నం పాచి స్మెల్ లేదా చెడిపోయి ఉండకూడదు. ఫ్రెష్ గా, పొడిపొడిగా ఉన్న అన్నం మాత్రమే ఉపయోగించాలి. స్టోర్ రైస్ (రేషన్ బియ్యం) లేదా సోనామసూరి బియ్యంతో వండిన అన్నం కూడా వాడుకోవచ్చు. అన్నం పొడిపొడిగా ఉంటేనే వడియాలు చక్కగా వస్తాయి.
మిక్సీ పట్టడం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అన్నం వేయాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా నున్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అన్నం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టడం చాలా ముఖ్యం. నూక లాగా ఉండకూడదు. నూక లాగా ఉంటే వడియాలు ఆరిన తర్వాత మధ్యలో చీలిపోతాయి. ఇడ్లీ పిండిలాగా, గంజి కాస్తే ఎలా వస్తుందో అలా నున్నని పేస్ట్ లాగా ఉండాలి. కావాలంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు కూడా వేసుకోవచ్చు. తాజాగా వండిన అన్నం అయితే, దాని గంజిని పారవేయకుండా చల్లార్చి, నీళ్లకు బదులుగా మిక్సీ పట్టేటప్పుడు వాడుకోవచ్చు.
ఫ్లేవర్స్ కలపడం: మిక్సీ పట్టిన అన్నం పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు తక్కువగా వేసుకోవడం మంచిది, ఎందుకంటే వడియాలు ఆరిన తర్వాత ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ బదులు పచ్చి మిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పూర్తిగా వద్దు అనుకుంటే, కేవలం ఉప్పు వేసి కూడా వడియాలు చేసుకోవచ్చు. కావాలంటే నువ్వులు కూడా కలుపుకోవచ్చు.
వడియాలు పెట్టడం: వడియాలు పెట్టడానికి శారీలకు వచ్చే కవర్లు లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్లను కట్ చేసి ఉపయోగించవచ్చు. బియ్యం గోతం కవర్ కూడా పనికొస్తుంది. ఈ ప్లాస్టిక్ కవర్ల పైన పిండిని చిన్న గరిటెతో వడియాలుగా లేదా పెద్ద అప్పడాలుగా పెట్టుకోవాలి. వడియాలను కాస్త మందంగా పెట్టుకోవాలి. సన్నగా పెడితే ఆరిన తర్వాత చాలా పల్చగా అయిపోయి మధ్యలో విరిగిపోతాయి. మరీ ఎక్కువ మందంగా పెట్టినా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి సరైన మందంలో చూసి పెట్టుకోవాలి. పిండి ఇడ్లీ పిండిలాగా ఉండాలి, మరీ లూజ్‌గా ఉండకూడదు.
ఆరబెట్టడం: వడియాలను ఎండలో ఆరబెడితే చాలా త్వరగా (ఒక రోజులో) ఆరిపోతాయి. ఇంట్లో ఫ్యాన్ గాలి కింద ఆరబెడితే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. ఉదయం పెడితే సాయంత్రానికి చక్కగా ఆరిపోతాయి. ఇంట్లో ఆరబెట్టినట్లయితే, అవి పూర్తిగా ఎండిన తర్వాత నిల్వ చేయడానికి ముందు ఒక గంట పాటు ఎండలో పెట్టడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల వడియాలు గలగల సౌండ్ వస్తూ, తేమ లేకుండా పూర్తిగా ఎండిపోయి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి.
వేయించడం: వడియాలు వేయించడానికి స్టవ్ వెలిగించి నూనె పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాతే వడియాలు వేయాలి. నూనె వేడి తక్కువగా ఉంటే వడియాలు పొంగవు. బాగా వేడెక్కిన నూనెలో వేస్తే చక్కగా పొంగుతూ తెల్లగా వస్తాయి.
ఈ అన్నం వడియాలు పిల్లలకు స్నాక్స్‌గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి.. ఇంకా చాలా తక్కువ నూనెను పీల్చుకుంటాయి. ఇంకెప్పుడు అన్నం మిగిలినా కూడా పారేయకుండా, ఇలా రుచికరమైన, కలర్‌ఫుల్ వడియాలు తయారు చేసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..