డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్.. ఇన్సులిన్ విడుదలను అడ్డుకునే రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు!
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల గుండె, మూత్రపిండాలు, కళ్లతో పాటు శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే మధుమేహం ఎలా అభివృద్ధి చెందుతుంది? శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, విడుదల ఎందుకు తగ్గుతుంది? అనే అంశాలపై ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కీలక విషయాలను గుర్తించారు.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో మధుమేహం (డయాబెటిస్) ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల గుండె, మూత్రపిండాలు, కళ్లతో పాటు శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే మధుమేహం ఎలా అభివృద్ధి చెందుతుంది? శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, విడుదల ఎందుకు తగ్గుతుంది? అనే అంశాలపై ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కీలక విషయాలను గుర్తించారు.
ఇన్సులిన్‌ను అడ్డుకుంటున్న రోగనిరోధక కణాలు!
మన శరీరంలోని క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి విడుదల చేస్తాయి. ఈ ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలు వినియోగించుకునేందుకు సహాయపడుతుంది.
అయితే క్లోమగ్రంథిలోనే ఉండే మాక్రోఫేజ్‌లు అనే రోగనిరోధక కణాలు బీటా కణాల పనితీరును ప్రభావితం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇవే ఇన్సులిన్ విడుదలను వేగంగా తగ్గించగలవని తాజా పరిశోధన వెల్లడించింది.
స్ఫింగోలిపిడ్స్.. GPR18 కీలక పాత్ర!
ఈ ప్రక్రియలో స్ఫింగోలిపిడ్స్ అనే కొవ్వు అణువులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మాక్రోఫేజ్ కణాల్లో ఒక ప్రత్యేక సంకేత ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఈ కొవ్వు అణువులు విడుదలవుతాయి. అవి పక్కనే ఉన్న బీటా కణాల్లోకి చేరి ఇన్సులిన్ విడుదలకు సంబంధించిన వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఈ ప్రక్రియను ప్రారంభించే కీలక గ్రాహకంగా GPR18ను పరిశోధకులు గుర్తించారు. ఈ మార్గాన్ని అడ్డుకున్నప్పుడు ప్రయోగాల్లో ఇన్సులిన్ విడుదల మెరుగుపడినట్లు తేలింది.
మనుషుల కణజాలంపైనా పరిశోధన!
సిమ్రన్ సింగ్, ఆశిష్ కుమార్ నేతృత్వంలో, డాక్టర్ సాయి ప్రసాద్ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగింది. తొలుత జంతువులపై ప్రయోగాలు నిర్వహించగా, అనంతరం అమెరికాలోని ఇండియానా బయోసైన్సెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో మానవ క్లోమగ్రంథి కణజాలంపైనా అధ్యయనం చేశారు. అక్కడ కూడా ఇదే ప్రక్రియకు సంబంధించిన ఆధారాలు లభించాయి. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య పరిశోధనా జర్నల్ ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్’లో 2026 సెప్టెంబర్ 15న ప్రచురితమయ్యాయి.
డయాబెటిస్‌కు మందు వచ్చేసినట్లేనా?
ఈ పరిశోధనతో మధుమేహానికి వెంటనే మందు కనుగొన్నట్లు కాదు. అయితే ఇన్సులిన్ విడుదలను అడ్డుకుంటున్న జీవ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి కొత్త మార్గం లభించింది. ముఖ్యంగా ఊబకాయం, టైప్-2 మధుమేహంతో బాధపడేవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల పనితీరును కాపాడేందుకు భవిష్యత్తులో కొత్త ఔషధాల అభివృద్ధికి ఈ పరిశోధన ఉపయోగపడవచ్చు. మరిన్ని క్లినికల్ అధ్యయనాలు, పరిశోధనలు అవసరం. మొత్తానికి, మధుమేహంపై పోరాటంలో ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తల పరిశోధన మరో కీలక ముందడుగుగా నిలిచింది.
గమనిక: ఇది పరిశోధన ఆధారిత వార్త మాత్రమే. మధుమేహ మందులు లేదా ఇన్సులిన్ వాడకాన్ని వైద్యుల సలహా లేకుండా మార్చకూడదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
