
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన ఒక వేడుకలో ఆమె ధరించిన చీర, నగలు ఒక ఎత్తు అయితే.. ఆమె చేతిలో ఉన్న ఒక చిన్న హ్యాండ్‌బ్యాగ్ మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. చూడటానికి అరచేతిలో ఇమిడిపోయేలా ఉన్న ఆ బ్యాగ్ ధరతో ఒక లగ్జరీ విల్లా లేదా కొన్ని డజన్ల లగ్జరీ కార్లు కొనేయొచ్చు. కేవలం మూడంటే మూడు ముక్కలు మాత్రమే ఉన్న ఆ అరుదైన బ్యాగ్ విశేషాలేంటి? అంత ధర ఎందుకుందో తెలుసుకుందాం..
మనీష్ మల్హోత్రా నిర్వహించిన ఒక పార్టీలో నీతా అంబానీ సిల్వర్ కలర్ సీక్విన్ శారీలో దేవకన్యలా మెరిసిపోయారు. ఈ చీరను మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా రూపొందించారు. దీనికి జతగా ఆమె తన వ్యక్తిగత కలెక్షన్ లోని అరుదైన హార్ట్ షేప్ కొలంబియన్ ఎమరాల్డ్ ఇయర్ రింగ్స్, డైమండ్ బ్రేస్లెట్ ధరించారు. అయితే ఫ్యాషన్ ప్రియుల కళ్లన్నీ ఆమె చేతిలో ఉన్న ‘హెర్మేస్ బిర్కిన్’ మినీ బ్యాగ్ పైనే పడ్డాయి.
నీతా అంబానీ పట్టుకున్న బ్యాగ్ పేరు ‘శాక్ బిజౌ’. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లలో ఒకటి. దీని ధర అక్షరాలా 2 మిలియన్ డాలర్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 17 కోట్ల 57 లక్షల రూపాయలు! ఇంత చిన్న బ్యాగ్ కు అంత ధర ఏంటని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది సాధారణ చర్మంతో చేసిన బ్యాగ్ కాదు, ఇది ఒక అద్భుతమైన కళాఖండం. హెర్మేస్ బ్రాండ్ లోని హై జ్యువెలరీ కలెక్షన్ లో భాగంగా దీనిని రూపొందించారు. ఈ బ్యాగ్ తయారీలో వాడిన వస్తువులు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ బ్యాగ్ ను 18 క్యారెట్ల స్వచ్ఛమైన వైట్ గోల్డ్ తో తయారు చేశారు. దీనిపై ఏకంగా 3,025 ధగధగ మెరిసే వజ్రాలను పొదిగారు. మొత్తం వజ్రాల బరువు 111.09 క్యారెట్లు ఉంటుంది. బ్యాగ్ పైభాగం మొసలి చర్మాన్ని పోలి ఉంటుంది, కానీ అదంతా వజ్రాల అమరికతోనే చేయడం విశేషం.
నిజానికి హెర్మేస్ జ్యువెలరీ క్రియేటివ్ డైరెక్టర్ పియర్ హార్డీ దీనిని హ్యాండ్‌బ్యాగ్ లా వాడటానికి డిజైన్ చేయలేదు. 2012లో దీనిని ఒక ‘బ్రేస్లెట్’ లాగా ప్రదర్శించారు. కానీ నీతా అంబానీ దీనిని తన చీరకు తగ్గట్టుగా ఒక మినీ హ్యాండ్‌బ్యాగ్ లా ధరించి తన స్టైల్ స్టేట్‌మెంట్‌ను చాటుకున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటి బ్యాగులు కేవలం మూడు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. నీతా అంబానీ ఎప్పుడూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో ముందుంటారు. 17 కోట్ల బ్యాగ్ అంటే సామాన్యులకు అది ఊహకందని విషయం కానీ, అంబానీ ఇంట విలాసాలకు అది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.