మీరు నోటిపూతతో ఇబ్బంది పడుతున్నారా..? ఏది తినాలన్న నోటి మంటతో అవస్థ పడుతున్న వారికి కొన్ని నేచురల్ రెమిడీస్ అద్బతుంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఇలాంటి ఇంటి నివారణలతో మీరు వీలైనంత త్వరగా నోటి పొక్కులు, పూతల నుండి ఉపశమనం పొందుతారు. అయితే, అసలు నోటిపూత ఎందుకు వస్తుంది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
నోటి పూత రావడానికి ముఖ్య కారణం అధిక ఒత్తిడి అంటున్నారు నిపుణులు. మనం తీసుకునే ఆహారం మన శరీరానికి పడకపోవడం వల్ల కూడా నోటీ పొక్కులు వస్తుంటాయి. అలాగే, ఎక్కువగా ఆమ్ల గుణాలు ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల కూడా నోట్లో పొక్కులు ఏర్పడుతుంటాయి. హార్మోన్ల అసమతుల్యత, విటమిన్, ఐరన్ లోపాలు, ఎక్కువగా పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు వాడటం, నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నోటి పూత వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇందుకు పరిష్కారం కూడా మనం ఇంట్లో లభించే వస్తువులతో లభిస్తుందని చెబుతున్నారు. అవేంటంటే..
– పొక్కులపై తేనెను పూస్తే వాటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. పొక్కులపై తేనె రాసి కాసేపు అలాగే ఉంచాలి.
– పొక్కులను తొలగించడానికి పసుపు, లేదంటే పసుపు నీటిని పుక్కిలించటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్సర్‌లను తొలగిస్తాయి.
– గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలను కలుపుకుని ఆ నీటిని కొంత సేపు నోటిలో ఉంచుకుని పుక్కిలించాలి. ఇది అల్సర్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
– నోటిపూతపై కొబ్బరినూనె రాయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇది అల్సర్ల నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
– యాపిల్ సైడర్ వెనిగర్ అల్సర్ చికిత్సకు ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల వెనిగర్ మిక్స్ చేసి ఈ నీటితో పుక్కిలించాలి.
– నోటిపూత వల్ల వచ్చే నొప్పి తగ్గాలంటే చిన్న ఐస్ ముక్కను తీసుకుని దాంతో గాయం ఉన్న ప్రాంతంలో నెమ్మదిగా రుద్దడం, బాగా చల్లటి నీటితో నోరు శుభ్రపరచుకోవడం, లాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
– తులసి ఆకులతో కూడా నోటి పూతకు చికిత్స లభిస్తుంది. నోట్లో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకోవాలి. ఆ తరువాత నీటితో పాటే తులసి ఆకుల్ని నమలాలి. దీనివల్ల నోటిపూత త్వరగా తగ్గుతుంది.
పాల పదార్థాలతో సైతం నోటిపూత సమస్యను తగ్గించుకోవచ్చు. సమస్య ఉన్న చోట నెయ్యి రాయడం, ప్రతిరోజూ రెండుమూడు సార్లు ఒక గ్లాస్ చొప్పున మజ్జిగ తాగడం, వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..