Micro Workouts: ప్రతిరోజూ 5 నిమిషాలు కేటాయిస్తే రోజు మొత్తం యాక్టివ్‌నెస్ మీ సొంతం

ఈ రోజుల్లో, వేగంగా మారుతున్న జీవితంలో వ్యాయామం కోసం ప్రతిరోజూ జిమ్‌లో గంటలు గంటలు గడపడానికి, సుదీర్ఘమైన వ్యాయామం చేయడానికి చాలామందికి సమయం దొరకడం లేదు. 'సమయం లేదు' అనే కారణం చెప్పి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారి సంఖ్య రోజురోజుకీ ..

Micro Workouts: ప్రతిరోజూ 5 నిమిషాలు కేటాయిస్తే రోజు మొత్తం యాక్టివ్‌నెస్ మీ సొంతం
Micro Workouts

Updated on: Dec 05, 2025 | 8:24 AM

ఈ రోజుల్లో, వేగంగా మారుతున్న జీవితంలో వ్యాయామం కోసం ప్రతిరోజూ జిమ్‌లో గంటలు గంటలు గడపడానికి, సుదీర్ఘమైన వ్యాయామం చేయడానికి చాలామందికి సమయం దొరకడం లేదు. ‘సమయం లేదు’ అనే కారణం చెప్పి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

కానీ, కేవలం 30 నిమిషాలైనా వ్యాయామం చేయకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు నిపుణులు సూచిస్తున్న తేలికైన పద్దతి మైక్రో-వర్కౌట్స్. కేవలం 5 నిమిషాలు చేసే ఈ వ్యాయామాలు శరీరాన్ని రోజంతా హుషారుగా ఉంచుతాయంటున్నారు నిపుణులు.

అంటే ఏంటి..

మైక్రో-వర్కౌట్స్ అంటే రోజులో వేరువేరు సమయాల్లో, కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు చేసే చిన్నపాటి వ్యాయామాలు. ఈ వ్యాయామాలను మీ రోజువారీ పనుల మధ్య సులభంగా చేసుకోవచ్చు. ఉదయం కాఫీ బ్రేక్‌లో, మీటింగ్స్ మధ్య విరామాలలో, లేదా రాత్రి భోజనానికి ముందు కూడా చేసుకోవచ్చు.

ఇవి జిమ్ మెంబర్​షిప్​తో పని లేకుండా, కేవలం శరీర బరువును ఉపయోగించి చేయగలిగే చిన్నపాటి కదలికలు. ఇవి కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాక, మానసిక ఏకాగ్రతను, శక్తి స్థాయిలను కూడా పెంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా, నిరంతరంగా ఒకే చోట కూర్చునే ఉద్యోగులకు ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం.

మైక్రో-వర్కౌట్స్ అనేవి కేవలం సమయం లేని వారికి మాత్రమే కాదు, ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపగల శక్తివంతమైన సాధనాలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజంతా ఒకేసారి 30 నిమిషాలు వ్యాయామం చేయడం కంటే, రోజులో చిన్న చిన్న విరామాలలో 5-10 నిమిషాలు చురుకుగా కదలడం వల్ల కూడా దాదాపు అదే ఫలితాలు లభిస్తాయి.

1. శక్తి పెరుగుతుంది

ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుంటే మన శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. కేవలం ఐదు నిమిషాల చిన్న వ్యాయామం చేయడం ద్వారా గుండె వేగం పెరుగుతుంది, మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ఇది తక్షణమే శరీరంలో పేరుకుపోయిన బద్ధకాన్ని తొలగించి, మిమ్మల్ని మరింత చురుకుగా, శక్తివంతంగా మారుస్తుంది. మధ్యాహ్నం వచ్చే నిద్రమత్తును తొలగించడానికి ఒక చిన్న వర్కౌట్ చాలా బాగా పనిచేస్తుంది.

2. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించడానికి చాలా ముఖ్యం. ఉద్యోగులు భోజనం తర్వాత 5 నిమిషాలు మెట్లు ఎక్కడం లేదా కొన్ని స్క్వాట్స్ చేయడం ద్వారా, ఇన్సులిన్ మెరుగుపరచవచ్చు. ఇది ముఖ్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా ప్రయోజనకరం.

3. ఏకాగ్రత పెరుగుతుంది

ఒకే పనిని ఎక్కువసేపు చేసినప్పుడు మెదడు అలసిపోతుంది. చిన్నపాటి శారీరక విరామం తీసుకోవడం వల్ల మెదడుకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. మైక్రో-వర్కౌట్స్ చేయడం ద్వారా ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి, ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది తిరిగి పనిపై దృష్టి పెట్టడానికి, సృజనాత్మకతను పెంచడానికి సహాయపడుతుంది.

మైక్రో-వర్కౌట్స్ చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు, బట్టలు అవసరం లేదు. కేవలం 5 నిమిషాలు మాత్రమే కాబట్టి, దీన్ని పూర్తి చేయడానికి అంతగా మోటివేషన్ కూడా అవసరం లేదు. నిలబడిన చోటే 10 జంపింగ్ జాక్స్ లేదా 15 సెకన్లు గోడకు ఆనుకుని కూర్చోవడం వంటి వాటితో సులభంగా మొదలుపెట్టేయవచ్చు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధవహిస్తే భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది.. మీరూ ట్రై చేసేయండి!