Lifestyle: మీ సమయాన్ని వృథా చేసే ఈ ఐదు రకాల వ్యక్తుల గురించి మీకు తెలుసా..?

Lifestyle: మీ సమయాన్ని కాపాడుకోవడం అంటే ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించడం కాదు. అది సమర్థవంతంగా పని చేయడానికి అవసరమైన పద్ధతి. అనవసరమైన చర్చలు, ఒత్తిడిని తగ్గించగలిగితే నిజంగా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు. చిన్న మార్పులు చేస్తే కార్యాలయంలో సమయ నిర్వహణ మెరుగవుతుంది. దీంతో పనితీరు కూడా గణనీయంగా పెరుగుతుంది..

Lifestyle: మీ సమయాన్ని వృథా చేసే ఈ ఐదు రకాల వ్యక్తుల గురించి మీకు తెలుసా..?
Lifestyle

Updated on: Mar 16, 2026 | 6:49 PM

Lifestyle: ఈరోజు ఉద్యోగ జీవితంలో సమయం చాలా విలువైనది. కానీ చాలా సార్లు ఆఫీస్‌లో లేదా ఆన్‌లైన్‌ మీటింగ్‌లలో కొంతమంది సహచరులు తెలియకుండానే మన సమయాన్ని వృథా చేస్తుంటారు. ఐదు నిమిషాల పని నలభై నిమిషాలకు మారిపోవడం, చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా చూపించడం వంటి పరిస్థితులు సాధారణంగా కనిపిస్తాయి. ఇలాంటి వ్యక్తులు మన సమయాన్ని మాత్రమే కాదు, మన పనిలోని ఉత్సాహాన్ని కూడా తగ్గిస్తారు. అయితే వారిని నేరుగా విమర్శించకుండా, కొద్దిపాటి తెలివైన మార్గాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు. సాధారణంగా కార్యాలయాల్లో కనిపించే సమయాన్ని వృథా చేసే ఐదు రకాల వ్యక్తులు, వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.

  1. మీటింగ్‌ను దారి మళ్లించే వ్యక్తి: కొంతమంది మీటింగ్‌ను ఒక అంశంతో ప్రారంభించి చివరకు ప్రపంచంలోని అన్ని విషయాల గురించి మాట్లాడేలా మార్చేస్తారు. వారికి మాట్లాడటం ఇష్టం ఉంటుంది కానీ దాంతో మీటింగ్ అసలు లక్ష్యం తప్పిపోతుంది. అయితే మీటింగ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే ప్రధాన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పాలి. అప్పుడు సమయం వృధా కాకుండా ఉంటుంది. ఉదాహారణ: మనము ఈరోజు తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయం ఏమిటో ముందుగా నిర్ణయించుకోవడం. ఇలా చేయడం వల్ల మీటింగ్ లక్ష్యం అందరికీ స్పష్టంగా ఉంటుంది. ఎవరు విషయం నుంచి దారి మళ్లించినా మళ్లీ లక్ష్యానికి తీసుకురావడం సులభమవుతుంది.
  2. ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే వ్యక్తులు: ప్రతి మీటింగ్‌కు ఆలస్యంగా వచ్చే వ్యక్తుల కోసం అందరూ వేచి ఉండటం చాలా సాధారణం. కానీ ఇది ఒక తప్పు సందేశాన్ని ఇస్తుంది. అంటే వారి సమయం మాత్రమే విలువైనదని భావిస్తారు. “మూవింగ్ ట్రైన్” విధానాన్ని అనుసరించాలి. అప్పుడు ఏర్పాటు చేసుకున్న మీటింగ్‌లో అంశాలను స్పష్టంగా వివరించవచ్చు. సమయం వృథా కాదు. అయితే ఎవరిని ఎదురు చూడకుండా మీటింగ్‌ను సమయానికి ప్రారంభించాలి. తర్వాత వచ్చిన వారికి మళ్లీ మొత్తం విషయాన్ని వివరించకూడదు. మీటింగ్‌లో తాము లేకుంటే వివరాలు సరిగ్గా తెలియనే భావనతో వారు సమయానికి వచ్చేలా ప్లాన్‌ చేసుకుంటారు. సమయపాలన అనేది అడిగి పొందేది కాదు. సంస్కృతిగా ఏర్పడేది.
  3. అవసరానికి మించి వివరించే వ్యక్తి: ఏదైనా అంశాలన్ని చెప్పే ముందు కొంతమంది పూర్తి స్టోరీగా చెప్పడం ప్రారంభిస్తారు. చిన్న విషయాన్ని కూడా చాలా వివరంగా చెబుతారు. అవసరం లేని వివరాలు ఎక్కువగా ఉండటం వల్ల సమయం వృథా అవుతుంది. ఏ అంశాన్ని వివరించినా సోది చెప్పకుండా సింపుల్‌గా స్పష్టంగా అర్థమయ్యేలా తక్కువ సమయంలోనే వివరించాలి. ఉదాహరణ: మీ వివరాలు బాగున్నాయి. కానీ తదుపరి చర్య కోసం ముఖ్యమైన విషయం ఒక్కటి ఏమిటో చెప్పగలరా?” అని అడిగినప్పుడు వారు ప్రధాన విషయాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తారు. సమయం అనేది ప్రతి ఉద్యోగికి అత్యంత విలువైన వనరు. కార్యాలయంలో కనిపించే ఈ రకాల వ్యక్తుల వల్ల మన పనికి ఆటంకం కలగొచ్చు. అయితే సరైన విధంగా మాట్లాడడం, స్పష్టమైన లక్ష్యాలు పెట్టడం, సమయపాలన పాటించడం ద్వారా మన సమయాన్ని కాపాడుకోవచ్చు. చిన్న మార్పులు చేసుకుంటే కార్యాలయంలో పని మరింత సమర్థవంతంగా మారుతుంది.
  4. ప్రతి పనిని అత్యవసరంగా చూపించే వ్యక్తి: కొంతమందికి ప్రతి మెసేజ్‌, ప్రతి ఈమెయిల్‌ చాలా అత్యవసరంగా అనిపిస్తుంది. చిన్న సమస్యను కూడా పెద్ద సంక్షోభంలా చూపిస్తారు. ఇలా ప్రతి విషయాన్ని అత్యవసరంగా తీసుకుంటే రోజంతా ఒత్తిడిలోనే గడుస్తుంది. పనులకు ప్రాధాన్యత కేటాయించే విధానాన్ని పాటించాలి. వారిని ఆ సమస్య ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్పమని అడగాలి. చాలా సందర్భాల్లో వారు అత్యవసరంగా చెప్పే విషయాలు నిజానికి అంత పెద్ద సమస్యలు కావు. ప్రశాంతంగా స్పందించడం ద్వారా పరిస్థితి తీవ్రతను తగ్గించవచ్చు.
  5. నిర్ణయం తీసుకోని వ్యక్తి: కొంతమంది విశ్లేషణ చేయడంలో చాలా ఆసక్తి చూపుతారు కానీ నిర్ణయం తీసుకోవడంలో మాత్రం వెనుకంజ వేస్తారు. “ఇంకొంచెం సమాచారం కావాలి”, “ఇంకా కొంతమందిని చర్చలోకి తీసుకుందాం” అంటూ నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు. స్పష్టమైన ఎంపికను ముందుకు పెట్టాలి. మీటింగ్ ముగిసే ముందు ఇలా అడగాలి.. ఇది అవును, కాదు, లేదా మరుసటి రోజు వరకు వేచి చూద్దాం అనే మూడు ఎంపికల్లో ఏది? అని. దీని వల్ల సింపుల్‌గా అంశాలలో క్లారిటీ వవస్తుంది. ఇలా అడిగితే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే పడుతుంది. అప్పుడు వారు నిర్ణయం తీసుకోవడం ప్రారంభిస్తారు లేదా మార్గం సులభమవుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం:

మీ సమయాన్ని కాపాడుకోవడం అంటే ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించడం కాదు. అది సమర్థవంతంగా పని చేయడానికి అవసరమైన పద్ధతి. అనవసరమైన చర్చలు, ఒత్తిడిని తగ్గించగలిగితే నిజంగా ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు. చిన్న మార్పులు చేస్తే కార్యాలయంలో సమయ నిర్వహణ మెరుగవుతుంది. దీంతో పనితీరు కూడా గణనీయంగా పెరుగుతుంది.

Follow Us