
మనతో మాట్లాడుతున్న వ్యక్తులు నిజం చెబుతున్నారా లేక అబద్ధమా? ఇది తేల్చడం ఎవరికైనా సవాలుతో కూడుకున్న పని. అయితే అవతలి వ్యక్తి ప్రవర్తన, మాట తీరు, శరీర భాష లో వచ్చే మార్పులను గమనిస్తే కొన్ని సత్యాలను ఇట్టే పట్టేయవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. నిజం చెప్పడం కంటే అబద్ధం అల్లడానికి మెదడుకు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. అబద్ధాన్ని నమ్మదగినదిగా సృష్టించే క్రమంలో కలిగే మానసిక ఒత్తిడి శరీర భాషలో వ్యక్తమవుతుంది. 2008 నాటి ఒక అధ్యయనం ప్రకారం.. అబద్ధం చెప్పేవారు తాము చెప్పే విషయాన్ని మర్చిపోతామనే భయంతో చాలా త్వరగా స్పందిస్తారు లేదా సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కథను మార్చాల్సి వచ్చినప్పుడు వారు నత్తిగా మాట్లాడటం లేదా తడబడటం గమనించవచ్చు.
మనస్తత్వవేత్త బెల్లా డెపాలో పరిశోధన ప్రకారం.. నిజం చెప్పేవారు చిన్న చిన్న వివరాలు మర్చిపోయినా కథలోని ప్రధానాంశాన్ని మార్చరు. కానీ అబద్ధం చెప్పేవారు ప్రతిసారీ కథను మారుస్తూ ఉంటారు. ఆకస్మికంగా ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేక తడబడతారు. తమ అబద్ధాన్ని నమ్మించడానికి అనవసరమైన వివరణలు, అతిశయోక్తులు జోడిస్తారు.
రియాలిటీ మానిటరింగ్ సిద్ధాంతం ప్రకారం.. నిజమైన అనుభవాలలో స్పర్శ, దృష్టి, ధ్వని, వాసన వంటి ఇంద్రియ అనుభూతులు ఉంటాయి. కానీ కల్పిత కథలలో అంత లోతైన వివరాలు ఉండవు. మీకు అప్పుడు ఏమనిపించింది? వంటి ప్రశ్నలకు అబద్ధం చెప్పేవారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేరు. తరచుగా నాకు గుర్తున్నంత వరకు.. వంటి పదబంధాలను వాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
ప్రఖ్యాత మనస్తత్వవేత్త పాల్ ఎక్మాన్ ప్రకారం.. సెకన్ల కాలంలో ముఖంపై మెరిసిపోయే సూక్ష్మ కవళికలు మనిషి అసలు భావాలను బయటపెడతాయి. మాటలకు, ముఖంలోని భావాలకు పొంతన లేకపోతే అది అబద్ధానికి సంకేతం. అలాగే కొందరు అబద్ధం చెప్పేటప్పుడు కళ్లు కలపడానికి భయపడితే, మరికొందరు తాము నిజం చెబుతున్నామని నమ్మించడానికి కావాలనే కళ్లలోకి నేరుగా చూస్తూ వింతగా ప్రవర్తిస్తారు. అధిక వివరణలు ఇవ్వడం, అసాధారణ ప్రవర్తన, మాటల్లో అస్థిరత.. ఈ మూడింటిని గమనిస్తే ఎదుటి వ్యక్తి నిజాయితీని అంచనా వేయడం సులభమవుతుందని మానసిక వర్గాలు చెబుతున్నాయి.