
వారాంతంలో మొత్తం ఇంటిని క్లీన్ చేయాల్సి రావడంతో అలసట కూడా ఎక్కువవుతుంది. అయితే రోజువారీ జీవితంలో కొన్ని చిన్న అలవాట్లు చేసుకుంటే ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. జపాన్‌లో ఇంటి శుభ్రత, క్రమబద్ధతకు ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ కనిపించే కొన్ని అలవాట్లను మన ఇంట్లో కూడా సులభంగా పాటించవచ్చు.
1. వాడిన వస్తువును వెంటనే సర్దేయాలి
జపాన్‌లో పాటించే ముఖ్యమైన అలవాట్లలో ఒకటి ‘వన్ టచ్’ విధానం. అంటే ఏదైనా వస్తువును ఉపయోగించిన తర్వాత దాన్ని పక్కన పడేసి “తర్వాత సర్దుతాను” అనకుండా వెంటనే దాని స్థానంలో పెట్టడం. ఉదాహరణకు బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే బ్యాగ్‌ను సోఫాపై పడేయడం, తాళాలను టేబుల్‌పై ఎక్కడో పెట్టడం, టీ తాగిన కప్పును అక్కడే వదిలేయడం వంటివి చిన్న విషయాల్లా కనిపిస్తాయి.
కానీ ఇలాంటి చిన్న పనులు రోజూ కొనసాగితే ఇంట్లో గందరగోళం పెరిగిపోతుంది. అందుకే ఏ వస్తువును ఎక్కడి నుంచి తీసుకున్నామో, పని పూర్తయిన వెంటనే తిరిగి అక్కడే పెట్టే అలవాటు చేసుకోవాలి. దీంతో ప్రత్యేకంగా ఇంటిని సర్దుకోవడానికి తర్వాత ఎక్కువ సమయం అవసరం ఉండదు.
2. ఇంటి గుమ్మం దగ్గరే షూస్ విప్పేయాలి
జపాన్ ఇళ్లలో ప్రవేశ ద్వారం దగ్గర ‘గెంకాన్’ అనే ప్రత్యేక ప్రదేశం ఉంటుంది. బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అక్కడే షూస్ విప్పుతారు. దీంతో బయట రోడ్లపై ఉన్న దుమ్ము, మట్టి ఇంటి లోపలికి ఎక్కువగా రాకుండా ఉంటుంది.
మన ఇళ్లలో కూడా ఈ పద్ధతిని సులభంగా పాటించవచ్చు. ఇంటి గుమ్మం దగ్గర షూ ర్యాక్, డోర్ మ్యాట్, ఇంట్లో వేసుకునే ప్రత్యేక చెప్పులు ఏర్పాటు చేసుకోవచ్చు. బయట వేసుకునే షూస్‌తో ఇంట్లో తిరగకపోవడం వల్ల నేలపై దుమ్ము, మురికి పేరుకుపోవడం తగ్గుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు నేలపై ఆడుకునే ఇళ్లలో ఇది ఉపయోగకరమైన అలవాటుగా ఉంటుంది.
3. అవసరం లేని వస్తువులను దాచుకోవద్దు
“ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది” అనే ఆలోచనతో ఇంట్లో ఎన్నో వస్తువులను దాచుకుంటూ ఉంటాం. పాత ఛార్జర్లు, వైర్లు, ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు, పాత బ్యాగులు, బాక్సులు ఇలా ఉపయోగంలో లేని వస్తువులు అల్మారాలు, డ్రాయర్లు నింపేస్తాయి.
జపనీస్ సంస్కృతిలో ‘మొత్తైనాయ్’ అనే భావన వృథాను తగ్గించడాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే అవసరం లేని వస్తువులను ఎప్పటికీ దాచుకోవడం దీని ఉద్దేశం కాదు. నెలకు ఒకసారి కనీసం ఒక డ్రాయర్ లేదా అల్మారాను పరిశీలించి, నిజంగా ఉపయోగపడుతున్న వస్తువులు ఏవి, ఇక అవసరం లేనివి ఏవి అనేది గుర్తించాలి. ఉపయోగంలో లేని వస్తువులను అవసరమైన వారికి ఇవ్వడం లేదా రీసైకిల్ చేయడం మంచిది.
4. రోజూ 5–10 నిమిషాలు క్లీనింగ్ చేయండి
ఇంటిని వారమంతా అలాగే వదిలేసి ఆదివారం ఒకేసారి గంటల తరబడి శుభ్రం చేయడం కంటే ప్రతిరోజూ కొద్దిసేపు శుభ్రం చేయడం సులభం. దీనికోసం ప్రత్యేకంగా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు.
భోజనం చేసిన వెంటనే టేబుల్ తుడవడం, ఉపయోగించిన కప్పులు కడగడం, వంట పూర్తయిన తర్వాత కిచెన్ ప్లాట్‌ఫారమ్ శుభ్రం చేయడం, బాత్రూమ్‌లో నీరు నిలవకుండా వైపర్‌తో తోసేయడం వంటి చిన్న పనులను రోజువారీ అలవాటుగా మార్చుకోవచ్చు. ఇలా చేస్తే మురికి పెద్ద మొత్తంలో పేరుకుపోదు. వారాంతంలో చేయాల్సిన క్లీనింగ్ కూడా గణనీయంగా తగ్గుతుంది.
5. ప్రతి వస్తువుకూ ఒక ఫిక్స్‌డ్ ప్లేస్ ఉండాలి
తాళాలు, రిమోట్, బ్యాగులు, పత్రాలు, ఛార్జర్లు వంటి వస్తువులను ప్రతిసారీ ఒకే ప్రదేశంలో పెట్టే అలవాటు చేసుకోవాలి. ఒక వస్తువుకు ఒక స్థిరమైన స్థానం ఉంటే అది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
ఉదాహరణకు తాళాలకు ఒక హుక్, రిమోట్‌కు ఒక బాస్కెట్, ఛార్జర్లకు ఒక ప్రత్యేక బాక్స్, ముఖ్యమైన పత్రాలకు ప్రత్యేక ఫైల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతిని పాటిస్తే వస్తువులు చిందరవందరగా పడేయడం తగ్గుతుంది. ఇంటిని శుభ్రం చేయడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.
6. ఖాళీ స్థలాన్ని కూడా అలాగే ఉంచాలి
ఇంట్లోని ప్రతి ఖాళీ ప్రదేశాన్ని వస్తువులతో నింపాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్న ఇళ్లలో నేలపై ఎక్కువ వస్తువులు ఉంచితే గది మరింత ఇరుకుగా కనిపిస్తుంది. అవసరమైన వస్తువులను షెల్ఫ్‌లు, గోడ హుక్స్, హ్యాంగింగ్ ఆర్గనైజర్లు వంటి వాటితో సర్దుకోవచ్చు.
జపనీస్ డిజైన్‌లో ‘మా’ అనే భావనకు ప్రాధాన్యత ఉంటుంది. ఖాళీ స్థలానికి కూడా ఒక విలువ ఉందనే ఆలోచన ఇందులో కనిపిస్తుంది. గదిలో కొంత ఖాళీ స్థలం ఉంచడం వల్ల ఇల్లు విశాలంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. అందుకే ఖాళీగా ఉన్న ప్రతి చోట ఏదో ఒక వస్తువును పెట్టాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి.
బయటకు వెళ్లే ముందు చిన్న రీసెట్
ఈ ఆరు అలవాట్లతో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు రెండు మూడు నిమిషాల పాటు చిన్న ‘రిసెట్’ చేసుకోవడం కూడా మంచి అలవాటు. సోఫా కుషన్లు సర్దడం, కప్పులను కిచెన్‌కు తీసుకెళ్లడం, టేబుల్‌పై ఉన్న వస్తువులను వాటి స్థానాల్లో పెట్టడం వంటి చిన్న పనులు చేస్తే ఇంట్లో గందరగోళం పేరుకుపోదు.
ఇలా చేయడం వల్ల తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కనిపించేది చిందరవందరగా ఉన్న ఇల్లు కాకుండా సర్దిన, శుభ్రమైన ఇల్లు. మొత్తంగా ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే ఎక్కువ గంటలు క్లీనింగ్ చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. వాడిన వస్తువును వెంటనే సర్దడం, షూస్‌ను గుమ్మం దగ్గరే ఉంచడం, అవసరం లేని వస్తువులను తొలగించడం, రోజూ కొద్దిసేపు శుభ్రం చేయడం వంటి చిన్న అలవాట్లే ఇంటి గందరగోళాన్ని చాలా వరకు నియంత్రించగలవు.