రాత్రిపూట పళ్లు కొరుకుతున్నారా? నిర్లక్ష్యం చేసేంత చిన్న సమస్య కాదని తెలుసా
సాధారణంగా ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినడం, శారీరక అలసట కలగడం గురించి మనకు తెలుసు. అయితే ఒత్తిడి ప్రభావం మన దంతాలపై కూడా తీవ్రంగా పడుతుందని మీకు తెలుసా? ఇటీవల ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. అధిక ఒత్తిడి వల్ల దంత సమస్యలు తలెత్తుతాయని, ముఖ్యంగా నిద్రలో పళ్లు కొరకడం వంటి అలవాట్లు పెరుగుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

చాలామందికి ఉదయం నిద్ర లేవగానే దవడ నొప్పి లేదా పంటి నొప్పి వేధిస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట తెలియకుండానే పళ్లు కొరకడం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 నుండి 36 శాతం మంది ప్రజలు రాత్రివేళల్లో రకరకాల ఆలోచనలు, ఒత్తిళ్లతో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సమస్యను ఎలా గుర్తించాలి, దీని నుండి దంతాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..
పళ్లు కొరకడం
మనం రాత్రిపూట ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచిస్తూ లేదా ఆందోళన చెందుతూ పడుకున్నప్పుడు, తెలియకుండానే పళ్లు పటపటా కొరుకుతుంటాము. ఈ నిరంతర రాపిడి వల్ల దంతాల పైన ఉండే ఎనామెల్ పొర దెబ్బతింటుంది. ఫలితంగా దంతాలు క్రమంగా బలహీనపడతాయి. ఉదయం లేవగానే దవడ దగ్గర పట్టేసినట్లు ఉండటం లేదా పంటి నొప్పిగా అనిపించడం వంటివి దీనికి ప్రధాన లక్షణాలు. దీనిని సకాలంలో గుర్తించకపోతే దంతాలు అరిగిపోయి, చిగుళ్ల సమస్యలకు కూడా దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మౌత్ గార్డ్ వాడకం
ఒత్తిడి కారణంగా పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు తమ దంతాలను రక్షించుకోవడానికి ‘మౌత్ గార్డ్’ వాడటం మంచిదని డెంటిస్ట్‌లు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు దీనిని ధరించడం వల్ల పై దంతాలు, కింది దంతాలు నేరుగా తగలకుండా ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. తద్వారా దంతాల మధ్య రాపిడి తగ్గి, అవి అరిగిపోకుండా కాపాడుకోవచ్చు.
ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు
ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారానే ఈ అలవాటును పూర్తిగా మానుకోవచ్చు. దీని కోసం నిపుణులు కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులను సిఫారసు చేస్తున్నారు.
- ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది.
- ధ్యానం, డీప్ బ్రీతింగ్ వంటి శ్వాస వ్యాయామాలు అలవాటు చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
- పడుకునే ముందు మనసును తేలికగా ఉంచుకోవడానికి టీవీల్లో కామెడీ షోలు లేదా ఆహ్లాదకరమైన పాత సినిమాలు చూడటం మంచి మార్గమని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన దంతాలు ముఖారవిందానికే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకం. కాబట్టి ఒత్తిడిని దంతాల వరకు చేరనివ్వకుండా, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి
