
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్నది నానుడి. ఆపిల్ కేవలం ఒక పండు మాత్రమే కాదు.. అది ఒక అద్భుత ఔషధం. మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, విజ్ఞాన శాస్త్రంలో గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టడానికి కూడా ఇదే కారణమైంది. అయితే ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆపిల్ పండును తినే విషయంలో మనం చేసే ఒక చిన్న తప్పు తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది ఆపిల్ తిన్న వెంటనే దాహంగా ఉందని నీళ్లు తాగుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాలు పలచబడతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగకపోవడంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ రుగ్మతలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆపిల్ తిన్న తర్వాత కనీసం 30 నుండి 60 నిమిషాల వరకు నీళ్లు తాగకపోవడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే కేవలం ఒక గుక్కెడు నీరు మాత్రమే తీసుకోవాలి.
ఆపిల్ పండు ఇప్పుడే పుట్టింది కాదు.. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వృక్షశాస్త్రవేత్తల ప్రకారం.. ఆపిల్ మొట్టమొదట మధ్య ఆసియాలోని కజకిస్తాన్‌లో క్రీ.పూ. 10,000 ప్రాంతంలో కనిపించింది. ప్రాచీన భారతీయ వైద్య గ్రంథం చరక సంహితలో కూడా ఆపిల్ ప్రస్తావన ఉంది. మన పూర్వీకులు దీనిని శరీరాన్ని చల్లబరిచే పండుగా గుర్తించారు. సర్ ఐజాక్ న్యూటన్ తలపై ఆపిల్ పడటంతోనే ఆయన గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 రకాల ఆపిల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఒక సాధారణ పరిమాణంలో ఉండే ఆపిల్ మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇందులో 52 కేలరీలు, 13.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 2.4 గ్రాములు ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ట్రిప్టోఫాన్ నిద్రలేమి, ఒళ్లు నొప్పులను తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
గుండె ఆరోగ్యం: ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.
జీర్ణశక్తి: మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
బరువు తగ్గడం: ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.