ఇండియన్ vs వెస్ట్రన్ టాయిలెట్.. మీకు తెలియని అసలు నిజాలు.. మన పూర్వీకుల అద్భుత ఆలోచన..

మారుతున్న కాలంతో పాటు మన ఇళ్లలోని బాత్రూమ్‌లు కూడా మారిపోయాయి. పాతకాలపు ఇండియన్ టాయిలెట్ల స్థానాన్ని ఆధునిక వెస్ట్రన్ కమోడ్‌లు ఆక్రమించేశాయి. కూర్చోవడానికి వెస్ట్రన్ టాయిలెట్లు ఎంతో సౌకర్యంగా ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. ఇవి మనల్ని నెమ్మదిగా రోగులుగా మారుస్తున్నాయా? వీటివల్ల వచ్చే సమస్యలు ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

ఇండియన్ vs వెస్ట్రన్ టాయిలెట్.. మీకు తెలియని అసలు నిజాలు.. మన పూర్వీకుల అద్భుత ఆలోచన..
Indian Toilet Vs Western Toilet

Updated on: Jul 03, 2026 | 8:21 AM

ఆధునిక జీవనశైలిలో భాగంగా మనం ఎన్నో మార్పులను ఆహ్వానిస్తున్నాం. అందులో ముఖ్యమైనది పాతకాలపు ఇండియన్ టాయిలెట్ సిస్టమ్‌ను వదిలి వెస్ట్రన్ కమోడ్స్ వైపు మళ్లడం. అయితే మన పూర్వీకుల పద్ధతులు కేవలం అలవాట్లు మాత్రమే కాదని, అవి మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మార్గాలని సెలబ్రిటీ మాక్రోబయోటిక్ కోచ్ డాక్టర్ శిల్ప అరోరా అభిప్రాయపడ్డారు. పూర్వకాలంలో టాయిలెట్స్ ఇంటికి దూరంగా ఉండేవి, దీనివల్ల ఆ అవసరం కోసం వెళ్లేటప్పుడు నడక సాగేది. ఆ తర్వాత కింద కూర్చుని మల విసర్జన చేసే పద్ధతి వల్ల కాళ్ల కండరాలకు మంచి వ్యాయామం లభించేదని ఆమె తెలిపారు.

వెస్ట్రన్ టాయిలెట్స్ వల్ల వచ్చే సమస్యలేంటి?

యోగా, ప్రత్యామ్నాయ వైద్య నిపుణుడు అనాది శర్మ చెబుతున్న దాని ప్రకా.. మనం కూర్చునే విధానం మన శరీర పనితీరుపై ప్రభావం చూపుతుంది. వెస్ట్రన్ టాయిలెట్స్‌లో కూర్చున్నప్పుడు శరీరం ఒక కుర్చీలో కూర్చున్నట్లు ఉంటుంది. ఇది మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ ఈ పద్ధతిలో మల విసర్జన కష్టంగా మారి మలబద్ధకం లేదా పైల్స్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. దానికి భిన్నంగా.. ఇండియన్ టాయిలెట్ పద్ధతిలో స్క్వాటింగ్ చేయడం వల్ల శరీరం సహజమైన భంగిమలోకి వస్తుంది. ఇది ప్రేగులను నిటారుగా ఉంచి, ఎలాంటి శ్రమ లేకుండా విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.

ఫోన్ల వాడకం – పెరుగుతున్న ముప్పు

ఫోర్టిస్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ప్రణవ్ హొన్నవార శ్రీనివాసన్ మాట్లాడుతూ.. టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను, రెక్టల్ ప్రాంతాల్లోని సిరలపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఈ రోజుల్లో చాలా మంది టాయిలెట్‌లో ఫోన్ వాడుతూ ఎక్కువ సమయం గడపడం అలవాటుగా చేసుకున్నారు. దీనివల్ల రక్తం గడ్డకట్టడం, సిరలు వాచిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమై, కాలక్రమేణా పైల్స్ సమస్య తీవ్రమవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.

చర్మ సమస్యలకు కూడా అదే కారణం..

టాయిలెట్‌ను కేవలం మల విసర్జనకే కాకుండా ఫోన్ వాడటానికి కూడా వినియోగించడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని మణిపాల్ హాస్పిటల్ నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ వంటి తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ సై లహరి రాచుమల్లు మాట్లాడుతూ.. ఇలాంటి వాతావరణంలో ఇంటర్‌ట్రిగో వంటి సమస్యలు తలెత్తుతాయని, శుభ్రత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇండియన్ టాయిలెట్ వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు..

కండరాల బలం: నిత్యం కింద కూర్చోవడం ఒక చిన్న వ్యాయామంలా పనిచేస్తుంది. ఇది కాళ్లు, తుంటి కండరాలను బలంగా ఉంచి, వృద్ధాప్యంలోనూ శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.

మెరుగైన పరిశుభ్రత: వెస్ట్రన్ టాయిలెట్స్‌తో పోలిస్తే, ఇండియన్ టాయిలెట్‌లో పబ్లిక్ వాడకం ఉండదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ల భయం తక్కువ. నీటి వినియోగం నేరుగా ఉండటం వల్ల శుభ్రత కూడా మెరుగ్గా ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ: మల విసర్జన సాఫీగా జరగడం వల్ల కడుపు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

వెస్ట్రన్ టాయిలెట్స్ సౌకర్యవంతంగా అనిపించినా, ఆరోగ్యపరంగా చూస్తే మన పూర్వీకుల ఇండియన్ టాయిలెట్ పద్ధతి కీళ్లు, కండరాలు, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. మీరు వృద్ధాప్యంలో కూడా దృఢంగా ఉండాలనుకుంటే, వీలైనంత వరకు ఈ సహజమైన పద్ధతిని పాటించడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

Follow Us