
పాఠశాలలో టీచర్లు, ఇతర పిల్లలతో కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించడం మంచిదని పిల్లలకు వివరించాలి. హలో అనడం ఒక మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల పిల్లలలో నమ్మకం పెరుగుతుంది. పరిచయం లేని వారితో స్నేహంగా మాట్లాడే ధైర్యం వస్తుంది.
బాత్రూమ్ కు వెళ్లాలనిపించినా, ఆకలి వేసినా, దాహంగా ఉన్నా.. ఈ విషయాలను టీచర్ కు చెప్పడం ఎలా అనే విషయాన్ని ముందే వివరించాలి. ఇలా అలవాటు చేస్తే పిల్లలు తాము ఎదుర్కొనే పరిస్థితులను చెప్పగలుగుతారు. సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం పొందగలరు.
టిఫిన్ బాక్స్ తెరవడం, తినడం, బాటిల్ తీసుకొని నీరు తాగడం వంటి చిన్న పనులు తామకు తామే చేయగలగాలి. ఇది వారిలో స్వతంత్ర భావాన్ని పెంచుతుంది. ఏదైనా సహాయం అవసరమైతే టీచర్ కు ఎటువంటి భయం లేకుండా తెలియజేయాలని చెప్పాలి. అవసరానికి సరైన దారిని ఎంచుకోవడం అలవాటు అవుతుంది.
స్కూల్ బ్యాగ్, టిఫిన్, బాటిల్.. ఇవన్నీ తామే చూసుకోవాలి. ప్రతి వస్తువును ఎక్కడ ఉంచాలో, ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఉపాధ్యాయునికి వెంటనే తెలియజేయాలని ముందుగా చెప్పాలి. ఇది జాగ్రత్తగా ఉండే నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది.
పాఠశాల పూర్తయ్యాక తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తారని నమ్మకం ఇవ్వాలి. ఇలా చెప్పితే పిల్లలు భయపడకుండా రోజంతా ప్రశాంతంగా గడుపుతారు. కచ్చితంగా సమయానికి వస్తామని చెప్పడం వారిలో భద్రత కలిగిస్తుంది. స్కూల్ కి పంపే సమయంలో ప్రేమతో మాట్లాడితే ఉదయం బాధగా ఉన్నా రోజంతా ఉత్సాహంగా గడిపేస్తారు.
ఈ చిట్కాలు పాటిస్తే మొదటి రోజు పిల్లలకు ఆనందంగా ఉంటుంది. చుట్టూ ఉన్న కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకోవాలనే భావనలో మార్పు కనిపిస్తుంది. పిల్లలు సురక్షితంగా, ధైర్యంగా ఉండటానికి తల్లితండ్రుల సహకారం ఎంతో అవసరం.