
రాత్రిపూట వేడివేడిగా, దూదిలాంటి మెత్తటి చపాతీలు కాల్చుకుని ఇష్టమైన కర్రీతో తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ తీరా వంటగదిలోకి వెళ్లి ఎంతో శ్రమపడి చేస్తే.. పెనంపై నుంచి దించిన కాసేపటికే అవి గట్టిగా, రబ్బరులా లేదా అప్పడాల్లా మారిపోతుంటాయి. దాంతో తినేటప్పుడు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. నిజానికి చపాతీలు మెత్తగా రాకపోవడానికి గోధుమ పిండి లోపం మాత్రమే కాదు.. పిండి కలపడం దగ్గరి నుంచి పెనంపై కాల్చే విధానం వరకు మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే ప్రధాన కారణం. ఈ సులభమైన కిచెన్ సీక్రెట్స్ పాటిస్తే రోజూ దూదిలాంటి సాఫ్ట్ చపాతీలను సులభంగా తయారు చేయవచ్చు.
మెత్తటి చపాతీ రావడానికి పునాది పిండి కలిపే విధానంలోనే ఉంది. చల్లటి లేదా సాధారణ నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఉపయోగించి పిండిని కలపాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని గ్లూటెన్ ప్రొటీన్ ఉత్తేజితమై, పిండి ముద్దకు మంచి సాగే గుణం వస్తుంది. నీటిని ఒకేసారి గుమ్మరించకుండా కొద్దికొద్దిగా చల్లుకుంటూ కలపాలి. పిండి ముద్ద నునుపుగా మారేలా కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు ఒత్తిడి ఇస్తూ కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, అలాగే మరీ జారుడుగా లేకుండా చెవి తమ్మెలా మృదువుగా ఉండాలి.
చాలామంది సమయం లేక పిండి కలపగానే వెంటనే చపాతీలు చేయడం ప్రారంభిస్తారు. ఇది పెద్ద పొరపాటు. పిండి ముద్ద సిద్ధమయ్యాక దానిపై అర టీస్పూన్ నూనె లేదా నెయ్యి రాయాలి. అనంతరం ఒక తేలికపాటి తడి కాటన్ గుడ్డను దానిపై కప్పి కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ సమయంలో పిండి తేమను పీల్చుకుని మరింత మృదువుగా మారుతుంది. దీనివల్ల చపాతీ కాల్చేటప్పుడు గుండ్రంగా, పూరీలా చక్కగా పొంగుతుంది.
చపాతీ పీటకు అంటుకోకుండా ఉండటానికి పదే పదే పొడి పిండిని అద్దుతుంటారు. ఎక్కువ పొడి పిండి వాడటం వల్ల పెనంపై కాలేటప్పుడు ఆ పిండి మాడిపోయి, చపాతీలోని సహజ తేమను పూర్తిగా పీల్చేస్తుంది. ఫలితంగా చపాతీ గట్టిగా మారుతుంది. కాబట్టి వీలైనంత తక్కువ పొడి పిండిని మాత్రమే వాడుతూ, అంచులపై సమానమైన ఒత్తిడి పెడుతూ గుండ్రంగా రుద్దుకోవాలి.
పెనం సరిగ్గా వేడెక్కక ముందే చపాతీ వేస్తే అది ఎక్కువ సేపు పెనంపైనే ఉండి రబ్బరులా సాగుతుంది. అలాగే పెనం విపరీతమైన మంటపై ఉంటే లోపల ఉడకకుండా పైన మాడిపోతుంది. పెనాన్ని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్య సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి. చపాతీ వేసిన తర్వాత చిన్న బుడగలు రాగానే మరోవైపు తిప్పి, రెండు వైపులా లేత గోధుమ రంగు మచ్చలు వచ్చే వరకు మాత్రమే కాల్చాలి. మాటిమాటికీ తిప్పకూడదు.
చపాతీలను కాల్చిన వెంటనే గాలి తగిలేలా ప్లేట్లలో వదిలేస్తే త్వరగా ఆరిపోయి గట్టిపడతాయి. కాలిన వెంటనే ఒక కాటన్ క్లాత్‌లో ఉంచి మూత పెడితే, అందులోని ఆవిరి తేమను అలాగే ఉంచి చపాతీలు గంటల తరబడి దూదిలా మెత్తగా ఉండేలా చేస్తుంది. ఈ చిన్నపాటి మార్పులను పాటిస్తే చపాతీలు చేయడం మీకు చిటికెలో పనిగా మారుతుంది.