
నీతి కథలు ఒక మంచి సందేశం లేదా జీవిత పాఠాన్ని చెప్పే కథలు. మంచి-చెడు మధ్య తేడాను ఈ నీతి కథలను తెలియజేస్తాయి. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇవి నైతిక విలువలు నేర్పుతాయి. ఇక్కడ ఇచ్చిన కొంగ జపం నీతి కథలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.. నిజానిజాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి అనే సందేశం ఉంది. గుడ్డిగా కొంగను నమ్మిన చేపలకు ఏమైయ్యింది? చివరికి దాని మోసాన్ని పీత ఎలా కనిపెట్టింది? కొంగ మోసానికి ఎలా ముగింపు పడిందో ఈ నీతి కథను చదివేయండి.
కథ
ఒకప్పుడు ఓ చెరువులో ఎన్నో చేపలు ఎంతో సంతోషంగా జీవించేవి. ఆ చెరువు ఒడ్డున ఓ కొంగ కూడా ఉండేది. ప్రతిరోజూ చెరువు దగ్గర నిలబడి, కళ్లుమూసుకుని జపం చేస్తున్నట్లుగా గంటల తరబడి నిశ్శబ్దంగా నిల్చొని ఉండేది. కొంగను చూసిన చేపలు.. “ఎంత మంచిది! మనల్ని తినకుండా దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది” అని అనుకునేవి.
అయితే ఆ కొంగ మనసులో మాత్రం వేరే ఆలోచన ఉంది. వయసు మీద పడటంతో చేపలను వేటాడటం కష్టమైంది. అందుకే ఓ రోజు కొంగ కన్నీళ్లు పెట్టుకుంటూ చేపలతో ఇలా చెప్పింది. “ఈ చెరువుకు త్వరలో పెద్ద ప్రమాదం రాబోతోంది. ఇక్కడి నీళ్లన్నీ ఎండిపోతాయని నాకు తెలిసింది. నేను ఎన్నో సంవత్సరాలు జీవించాను కాబట్టి మీ మీద జాలి కలుగుతోంది. నాతో వస్తే దగ్గర్లోనే ఉన్న మరో పెద్ద చెరువులో మిమ్మల్ని సురక్షితంగా వదిలేస్తాను” అని చెప్పింది.
కొంగ మాటలను చేపలు కూడా నమ్మాయి. “మనల్ని రక్షించడానికి ఈ కొంగ దేవుడే పంపాడు” అని భావించాయి. రోజూ ఒక్కో చేపను తన ముక్కుతో పట్టుకుని కొంగ ఎగిరిపోయేది. కానీ ఆ చేపలను మరో చెరువులో వదలకుండా, కొంత దూరంలో ఉన్న ఓ కొండపైకి తీసుకెళ్లి తినేసేది. కొన్ని రోజుల పాటు ఇదే తంతు కొనసాగింది.
ఆ చెరువులో ఓ పీత కూడా ఉండేది. దానికి కొంగపై అనుమానం వచ్చింది. “నన్ను కూడా ఆ కొత్త చెరువుకు తీసుకెళ్లు” అని కొంగను అడిగింది. పీతను తీసుకుని కొంగ ఎగురుతుండగా, మార్గమధ్యంలో పీతకు కింద కనిపించిన చేపల ఎముకలు కనిపించాయి. అసలు విషయం అర్థమైన పీత.. వెంటనే తన బలమైన పంజాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. “మోసం చేసి అమాయక చేపలను చంపుతున్నావా?” అంటూ పీత కొంగను నిలదీసింది. కొంగ భయపడిపోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. పీత తన పంజాలతో కొంగ మెడను గట్టిగా బిగించడంతో కొంగ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
పీత తిరిగి చెరువుకు చేరుకుని జరిగిన విషయాన్ని చేపలకు చెప్పింది. అప్పటి నుంచి చేపలు ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మకుండా, నిజానిజాలను తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం ప్రారంభించాయి.
నీతి
బయటకు మంచివాడిలా కనిపించే ప్రతి ఒక్కరూ నిజంగా మంచివారు కావాల్సిన అవసరం లేదు. ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మకుండా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కష్టకాలంలో ఎవరో ఒకరు చెప్పిన మాటలను నమ్మే ముందు నిజానిజాలను పరిశీలించాలి.
అలాగే మోసం కొంతకాలం విజయవంతమైనట్లు కనిపించినా.. చివరికి నిజం బయటపడుతుంది. తెలివి, అప్రమత్తతతో ప్రమాదాలను గుర్తిస్తే మోసగాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.