AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moral Story: చెడు సావాసంతో ఎప్పటికైనా నష్టమే! కోతి – తోడేలు నీతి కథ

Wolf and Monkey Story: చెడు స్నేహం జీవితాన్ని ఎలా ఇబ్బందుల్లోకి నెడుతుందో తెలియజేసే అద్భుతమైన నీతి కథే 'చెడ్డ సావాసం'. తప్పు చేయకపోయినా చెడ్డవారి సాంగత్యం వల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందనే గొప్ప జీవిత పాఠాన్ని ఈ కథ పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. తోడేలుతో సావాసం వల్ల కోతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో ఈ నీతి కథలో వివరించడం జరిగింది.

Moral Story: చెడు సావాసంతో ఎప్పటికైనా నష్టమే! కోతి - తోడేలు నీతి కథ
Wolf And Monkey Moral StoryImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jul 25, 2026 | 1:38 PM

Share

నీతి కథలు చిన్న పిల్లలతో పాటు పెద్దలకు కూడా నైతిక విలువలు నేర్పిస్తాయి. ఏది మంచి ప్రవర్తన, ఏది చెడు ప్రవర్తన అనేది విడమరిచి చెప్పడానికి ఈ కథలు ఉపయోగపడతాయి. అదే ఒక కథ రూపంలో నీతి చెబితే.. అది మనసులో నాటుకుపోతుంది. చెడ్డ స్నేహం, చెడు సావాసం ఎంత ప్రమాదకరమో చెప్పే ఎన్నో నీతి కథలు ఉన్నాయి. అలాంటి కథల్లో ఒకటి ‘చెడు సావాసం’. ఈ కథ పిల్లలకు మంచి స్నేహితులను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

కథ

అనగనగా ఒక అడవిలో ఓ తోడేలు ఉండేది. అది అడవిలోని చిన్న చిన్న జంతువులను వేటాడి ఆకలి తీర్చుకునేది. అయితే కొన్ని రోజులలో ఎంత వెతికినా ఆహారం దొరికేది కాదు. అలాంటి సమయంలో రాత్రివేళ అందరూ నిద్రపోయాక అడవికి సమీపంలోని గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తీసుకొచ్చి తినేది. అదే అడవిలో నివసించే ఒక కోతి, తోడేలు చేసే పనులను ఆసక్తిగా గమనించేది. తన తెలివితేటలతో గ్రామస్తుల కళ్లను ఎలా మోసం చేస్తుందో తోడేలు కోతికి గొప్పగా చెప్పుకునేది. ఆ మాటలు విన్న కోతికి కూడా తోడేలు ఎలా మేకలను పట్టుకుంటుందో స్వయంగా చూడాలని అనిపించింది.

ఒక రోజు కోతి..నువ్వు గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది అని అడిగింది. తోడేలు కూడా వెంటనే అంగీకరించి.. ఈ రాత్రే వెళ్తున్నా.. నాతో రా అని చెప్పింది. దీంతో కోతి ఎంతో సంతోషపడింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, గ్రామంలో తరచూ మేకలు కనిపించకుండా పోతుండటాన్ని గ్రామస్తులు గమనించారు. దొంగ ఎవరో తెలుసుకోవాలని కొందరు యువకులు రాత్రిపూట మేకలకు కాపలా కాయడం ప్రారంభించారు. ఆ విషయం తెలియని తోడేలు కోతిని వెంట తీసుకుని గ్రామంలోకి ప్రవేశించింది. మేకల దగ్గరకు వెళ్లిన తోడేలును కాపలా కాస్తున్న యువకులు గమనించారు. దీంతో మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది.

వెంటనే యువకులు కర్రలతో తోడేలుపై దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా వదల్లేదు. దెబ్బలు తట్టుకోలేక కోతి..మీ మేకలను తినడానికి వచ్చింది తోడేలు. నేను కాదు.. నన్నెందుకు కొడుతున్నారు? అంటూ వేడుకుంది. అందుకు యువకులు..తోడేలుకు తోడుగా వచ్చిన నిన్ను ఎలా వదిలేస్తాం? అంటూ మరింత గట్టిగా కొట్టారు. ఆ సమయంలో యువకుల దృష్టి తోడేలుపై పడగానే, కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని అడవికి చేరుకుంది. ఇకపై చెడ్డవారి సావాసం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.

నీతి

ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మనం తప్పు చేయకపోయినా.. చెడ్డవారి సాంగత్యంలో ఉంటే వారి చేసిన తప్పుకు మనమూ బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోవడం, చెడు పనులు చేసే వారితో దూరంగా ఉండటం చాలా అవసరం. చెడు సావాసం ఎప్పటికైనా నష్టానికే దారి తీస్తుంది. మంచి స్నేహం మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.

Follow Us