
మారుతున్న కాలంతో పాటు నేటి తరం యువత ఆలోచనా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించడం, ఆ వెంటనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవ్వడం జీవితంలో ఒక ఖచ్చితమైన మైలురాయిగా భావించేవారు. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బ్రిటన్‌లో జరిగిన ఒక తాజా అధ్యయనంలో సుమారు 50 శాతం మంది టీనేజర్లు భవిష్యత్తులో తాము పెళ్లి చేసుకోవడం అంత అవసరమేమీ కాదని అభిప్రాయపడగా, ఇదే ధోరణి ఇప్పుడు భారతదేశంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
భారతదేశ మొత్తం జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది జెన్-ఆల్ఫా (2010 తర్వాత జన్మించినవారు) వర్గానికి చెందినవారే ఉన్నారు. యూగవ్ అండ్ రుకమ్ క్యాపిటల్ సంయుక్తంగా రూపొందించిన ‘జెన్ ఆల్ఫా డికోడెడ్’ నివేదిక ప్రకారం, ఈ తరం పిల్లలు కేవలం గ్యాడ్జెట్లు వాడటంలోనే కాదు, ప్రాక్టికల్ ఆలోచనల్లోనూ చాలా ముందున్నారు. వీరిలో ప్రతి 10 మందిలో ఏడుగురు (70%) చిన్న వయసు నుంచే డబ్బు సంపాదించడంపై, ఆర్థిక విషయాలపై విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇళ్లలో జరిగే రోజువారీ నిర్ణయాలలో, కొనుగోళ్లలో 66 శాతం నిర్ణయాలు నేరుగా ఈ పిల్లల ఇష్టాయిష్టాల వల్లే ప్రభావితమవుతుండటం విశేషం.
వివాహానికి దూరంగా ఉండటంలో పురుషుల కంటే మహిళల గణాంకాలు పెద్ద సామాజిక మార్పును సూచిస్తున్నాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం, 2011 నుండి 2019 మధ్య కాలంలో తమ సొంత ఇష్టంతో అసలు పెళ్లే వద్దు అనుకునే యువతుల సంఖ్యలో 48 శాతం భారీ పెరుగుదల నమోదైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఒంటరిగా ఉండే (సింగిల్) మహిళల సంఖ్య 7 కోట్లుగా ఉంటే, ప్రస్తుతం అది 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా. దీనికి ప్రధాన కారణం విద్య మరియు ఆర్థిక స్వాలంబన. సొంతంగా సంపాదించే శక్తి రావడం మహిళల ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ రోజుల్లో మహిళలు తమకు సమాన హక్కులు ఇచ్చే, అనవసరమైన రాజీలు పడాల్సిన అవసరం లేని బంధాలనే కోరుకుంటున్నారు.
ఈ సామాజిక మార్పుల కారణంగా ప్రస్తుతం మహిళల మొదటి వివాహ సగటు వయసు 22.9 సంవత్సరాలకు, పురుషుల వయసు 25 సంవత్సరాలకు పెరిగింది. పెళ్లి కోసం భాగస్వామిని వెతకడం ప్రారంభించే సగటు వయసు కూడా 27 ఏళ్ల నుండి 29 ఏళ్లకు చేరింది. ప్రముఖ డేటింగ్ ప్లాట్‌ఫారమ్ ‘క్వాక్-క్వాక్’ (QuackQuack) సర్వేలో.. 28 ఏళ్లు పైబడిన 39 శాతం మంది డేటర్లు పెళ్లి అనేది జీవితంలో ఒక బలవంతపు బాధ్యత కాదని స్పష్టం చేశారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSO) డేటా కూడా ఈ సామాజిక మార్పును స్పష్టంగా ధృవీకరిస్తోంది.
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సేకరించిన డేటా ప్రకారం దేశంలో పెళ్లి కాని యువత సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. నేటి తరం యువత కుటుంబం, పిల్లలు అనే బంధాలలో ఇరుక్కుపోవడానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు ముసలితనంలో పిల్లలే ఆధారం అనుకునేవారు, కానీ నేటి ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉంటున్నారు. అలాగే, ఆధునిక వసతులతో కూడిన ‘ఓల్డ్ ఏజ్ హోమ్స్’ అందుబాటులోకి రావడం కూడా ఈ ఆలోచనకు కారణం.
పెరుగుతున్న ఖర్చులు, ప్రైవేట్ ఉద్యోగాలలో అభద్రత కారణంగా యువత మొదటి ప్రాధాన్యత ఆర్థికంగా స్థిరపడటానికే ఇస్తున్నారు. తమ జీవితంలో అత్యంత కీలకమైన 20, 30 ఏళ్ల వయసును యువతీ యువకులు కేవలం కెరీర్ బిల్డింగ్ కోసం, మల్టీటాస్కింగ్ చేయడానికే కేటాయిస్తున్నారు. పెళ్లి, పిల్లల భారీ బాధ్యతలను మోయడానికి తాము మానసికంగా ఇంకా సిద్ధంగా లేమని భావిస్తున్నారు.
నేటి తరం యువత తమ కాళ్లపై తాము నిలబడటాన్ని, నచ్చినట్లు జీవించడాన్నే అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. వారి దృష్టిలో పెళ్లి అనేది జీవితంలో ఒక ‘తప్పనిసరి భాగం’ కాదు, కేవలం ఒక ఆప్షన్ మాత్రమే! సాంప్రదాయ బంధాల కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ తరం నిర్ణయాలు రాబోయే రోజుల్లో సమాజ నిర్మాణాన్ని మరింతగా మార్చే అవకాశం ఉంది.